బీజేపీ - జనసేన మధ్య పొత్తు అంటీముట్టనట్టుగానే ముందుకు సాగుతుంది. ఏదో చెప్పాలని, మీడియా ముందు నాయకులు, ఏమి లేదు అని చెప్తున్నారు కానీ, గ్రౌండ్ లో అసలు కార్యకర్తలు కలిసి పని చేసింది లేదు. ఇదే విషయం జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కూడా తేల్చి చెప్పారు. వాళ్లతో పొత్తులో ఉంటే నష్టం తప్ప లాభం లేదని అన్నారు. ఇక తెలంగాణాలో అయితే, ఆల్మోస్ట్ ఇద్దరికీ చెడింది అనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కళ్యాణ్, టీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు వేయమని చెప్పారంటే, పరిస్థితి ఎక్కడ దాకా వెళ్లిందో అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, పై పైకి అంతా బాగుందని చెప్తున్నారు. తిరుపతి ఎంపీ సీటు విషయంలో, పవన్ కళ్యాణ్ పట్టుబట్టినా, చివరకు ఆ స్థానం బీజేపీ తీసుకుంది. మిత్ర ధర్మం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం, పవన్ కూడా సరే అన్నారు. అయితే ఆయన మొదట నుంచి ఒకటి చెప్తూ వస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానం విషయంలో బీజేపీ సీరియస్ గా తీసుకోవాలని, ఏదో చేసాం అంటే చేసాం అన్నట్టు అయితే తాను ప్రచారానికి రాలేనని చెప్పారు. అయితే నోటిఫికేషన్ వచ్చినా, ఇప్పటికీ ఎక్కడా జనసేన అడ్డ్రెస్ లేదు. మొత్తం బీజేపీ చేసుకుంటూ వెళ్తుంది. ఇంత అసంతృప్తిలో ఉన్న జనసేనకు, ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. నిన్న బీజేపీ, తమ అభ్యర్ధిని ప్రకటించింది.
ఆమె మాజీ ఐఏఎస్ రత్నప్రభ. ఆమె కూడా జగన్ కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే తరువాత కోర్టు కేసులు కొట్టేసినా, ఆమె వైఖరి మాత్రం ఎప్పుడూ జగన్ ని, రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూనే ఉంటారు. పార్టీలో కార్యకర్త లాగా వారికి ఎలివేషన్ ఇస్తూ ట్వీట్లు కూడా చేసారు. జగన్ మీద ఇంత అభిమానం ఉన్నవిడకు బీజేపీ టికెట్ ఇవ్వటం పై, జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటన బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా కాకుండా, బీజేపీ - వైసీపీ ఉమ్మడి అభ్యర్ధిగా అనిపిస్తుందని, దీని వెనుక చాలా పెద్ద శక్తులు ఉన్నాయని అనిపిస్తుందని జనసేన శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయం పై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. పవన్ ప్రచారానికి వెళ్ళాక పోవటమే మంచిదని వాపోతున్నారు. అయితే నిన్న రాత్రి బీజేపీ అభ్యర్ధిని ప్రకటించగా, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కాని, జనసేన కాని, ఆమెకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మిత్రపక్షంగా ఉన్న జసేనన, బీజేపీ వైఖరి పై అసంతృప్తిగా ఉందా అనే అనుమానం కలగక మానదు. జనసేన అధికారికంగా ప్రకటించే వరకు, వారి వైఖరి ఏమిటో తెలియదు.