స్థానిక సంస్థల ఎన్నికల డ్యూటీ నిర్వహించే అధికారులను బెదిరించే ధోరణిలో ఎంత పెద్ద స్థానంలో ఉన్న వారు మిమ్మల్ని భయపెట్టినా, ఎవరినీ లెక్క చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులకు స్పష్టం చేసారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులును భయపట్టే విధంగా ఎవరినా ప్రయత్నం చేస్తే, ఎన్నికల కమిషన్ చూస్తూ ఉండదు అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. చిత్తూరు, గుంటూరులో అసాధారణంగా వచ్చిన ఏకగ్రీవాల పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిన చేసిన తరువాతే ప్రకటన చేయాలని చెప్పటం, ఆ తరువాత దాని పై పెద్దిరెడ్డి స్పందిస్తూ, ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు పట్టించుకోనవసరం లేదని, వెంటనే ఏకగ్రీవాల ప్రకటన చేయాలని, ఎవరైనా నిమ్మగడ్డ చెప్పినట్టు వింటే, మిమ్మల్ని బ్లాక్ లిస్టు లో పెడతాం అంటూ, అధికారులను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. అయితే ప్రభుత్వం నుంచి, ఏకంగా ఒక మంత్రి ఎన్నికల కమిషన్ చెప్పిన మాటలు వినవద్దు అని ప్రకటన చేయటంతో, అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అటు రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ మాట వినాలని, కానీ ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో ఎన్నికలు అయిన తరువాత, పరిస్థితి ఏమిటి అనే విధంగా, భయపడుతున్న అధికారులకు ఎన్నికల కమీషనర్ భరోసా ఇచ్చారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కానీ, రిటర్నింగ్ అధికారులు కానీ ఎలాంటి భయం పెట్టుకోనవసరం లేదని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం, మీరు పని చేయండి, రాజ్యాంగమే మీకు రక్షణగా ఉంటుందని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. అధికారులు అందరూ ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని, మీ పై అకారణంగా ఏ చర్య తీసుకోవాలి అని ఎవరైనా అనుకున్నా, ముందు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని గుర్తు చేసారు. దీని పై గతంలో సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, మీరు ఎవరినీ భయపడవద్దు అని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పై, అనుమతి లేకుండా, తీసుకునే చర్యల పై నిషేధం విధిస్తూ, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇస్తుందని, అధికారులు రాజ్యాంగం ప్రకారం ధైర్యంగా పని చేయాలని భరోసా ఇచ్చారు. వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు శాశ్వతం అనే విషయం, ఇలా బెదిరిస్తున్న వారు గుర్తు ఉంచుకోవాలని, ఎలక్షన్ కమిషన్ ఆ ప్రకటనలో తెలిపింది.