రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదు కోసం రూపొందించిన ఈ-వాచ్ యాప్ ను, ఈ నెల 9వ తారిఖు వరకు ఉపయోగించ వద్దు అంటూ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం ఈ-వాచ్ యాప్ ఉపయోగం పై, రాష్ట్ర హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే ఇది అర్జెంట్ పిటీషన్ కింద లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా, హైకోర్టు అందుకు అనుమతించలేదు. తరువాత రోజు రెగ్యులర్ విచారణ చేస్తామని చెప్పింది. ముఖ్యంగా సెక్యూరిటీ అంశంతో పాటు, ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ యాప్ ను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలా ఉపయోగిస్తుంది అంటూ, ఆ పిటీషన్ లో తెలిపారు. ఇది సెక్యూరిటీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం అని చెప్పి, పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఈ పిటీషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, సెక్యూరిటీ డేటా సర్టిఫికేట్ కోసం, గురువారం మాత్రమే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం మాత్రమే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దరఖాస్తు చేసిందని, తమకు ఈ దరఖాస్తు నిన్న మధ్యానం అందింది అని, దీన్ని పరిశీలించి అనుమతి ఇచ్చేందుకు, అయుదు రోజులు సమయం పడుతుందని, ఏపి టెక్నాలజీ సర్వీసెస్ తరుపు న్యాయవాది, హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రైమరీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి యాప్ వినియోగం మాత్రం ఆపివేయాలని, పిటీషనర్లు వాదించారు. ఈ నేపధ్యంలోనే ఈ యాప్ ను ఉపయోగించటానికి సెక్యూరిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరం అని, ఇది ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు ప్రకారం, ఇది అవసరం అని కూడా స్పష్టం చేసారు.
అయితే ప్రభుత్వం నిఘా యాప్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ సొంతగా ఎందుకు యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అని కూడా, పిటీషనర్ తరుపున వాదనలు వినిపించారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తరుపున న్యాయవాదులు మాత్రం, ప్రతి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు మాత్రం, ఒక యాప్ తయారు చేసుకునే అనుమతిని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది అని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించారు. దీంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా రూపొందించిన ఈ-విజిల్ యాప్ ను, పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించటానికి వీలు లేదని, అది కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఉపయోగించాలని, అందులో స్పష్టంగా ఉందనే నిబంధనలను, ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరుపు న్యాయావడి కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఇక ఉత్తర ప్రాదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గతంలో యాప్ తయారు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి అనుమతి వచ్చే వరకు, అంటే ఈ నెల 9వ తేదీ వరకు, ఈ యాప్ ని వాడవద్దు అంటూ, హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 9వ తేదీన జరిగే విచారణలో తుది నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.