తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన స్వర్గీయ పొట్టి శ్రీరాములు తెలుగువారందరికీ ఆదర్శపాయులు. మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారు అనుభవిస్తున్న కష్టాలను గుర్తించి వారికంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన కృషి, పోరాటం అజరామరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్రం నలు మూలల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైశ్య నాయకుల సమక్షంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డుండి రాజేశ్ వందనం సమర్పణ చేశారు. ఆయన మాట్లాడుతూ, "ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు, దేశ సమైక్యత కోసం తపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు పడిన కష్టానికి ప్రతిఫలంగా రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కంకణబద్దంగా పని చేసింది. అడుగడుగునా తెలుగు ప్రజలు పడుతున్న అవమానాల నుండి విముక్తుల్ని చేయడం కోసం తన ప్రాణలు పణంగా పెట్టారు. స్వాతంత్ర్యోద్యమ స్పూర్తితో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. "
"రాష్ట్రం కోసం నాటి ప్రధాని నెహ్రూతో అవిశ్రాంత పోరాటం చేశారు. నిరాహార దీక్ష అంటే ఏంటో నిరూపించారు. ఆ దీక్ష చూసి దేశం కదిలింది. కర్నూలు రాజధానిగా భాషా ప్రయుక్త రాష్ట్రం సాకారమైంది. అక్కడ నుండి హైదరాబాద్ వెళ్లాం, తర్వాత అమరావతికి వచ్చాం. కుటుంబాన్ని, కార్యకర్తల్ని పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయపడ్డాను. ప్రజలు, రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకుని ప్రపంచ స్థాయి రాజదాని నగరం నిర్మాణానికి శ్రీకారం చుడితే విమర్శించారు. నేడు అదే స్పూర్తితో ఢిల్లీలో గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. లక్షల కోట్ల ఆదాయం వచ్చే నగరాన్ని, నాటి కలల్నీ ఈ దుర్మార్గులు నాశనం చేస్తున్నారు. అప్పుల కుప్ప చేశారు. భూములిచ్చిన రైతులపై కేసులు పెడుతున్నారు. బూటు కాళ్లతో తన్నారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అవమానించారు. మూడు రాజధానులు అంటూ అభివృద్ధిని, లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అమరావతిని దెబ్బతీశారు. చివరికి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నిన్న బీజేపీ కూడా ప్రధాని మోడీ మాటగా, అమరావతి రాజధాని అని చెప్పింది. ఇంత మంది ఇటు వైపు ఉంటే, జగన్ కు ఎందుకు అంత పంతం " అని చంద్రబాబు అన్నారు.