బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని,దీన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ వైద్య విజ్ఞాన మండలి, ఆరోగ్య పరిశోధక విభాగం కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ ద్వారా ద్వారా తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించింది. పొగాకు, ఖైనీ, సుపారి తదితర పదార్థాలను వాడొద్దని ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం సూచనను పరిశీలించిన సీఎం జగన్ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పొగాకు ఖైనీ లాంటి ఉత్పత్తులు నవలకుండా, ప్రజానీకం దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాల్లో తెలిపింది. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించనున్నట్లు తెలిపింది.

ఇండియన్ పీనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక మరో పక్క, ప్రజలకు పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం సూచించారు. మాస్కుల వల్ల కరోనా నుంచి కొంత రక్షణ లభిస్తుందని జగన్​ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా మాస్కులు పంపిణీ చేయాలని అన్నారు. హై రిస్క్‌ ఉన్నవారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రుల్లో చేర్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సీఎం సూచించారు.

1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సర్వే చేసి 32,349 మందిని రిఫర్‌ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధరించారు. అయితే మొత్తం 32,349 మందికి కరోనా పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా జోన్లలో 45 వేల కొవిడ్‌ పరీక్షలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణాలో ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రిందట, బహిరంగంగా ఉమ్మి వేయటం తప్పని సరి అని, అలాగే మాస్కులు ధరించటం తప్పని సరి అని, తెలంగాణా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

గుంటూరు జిల్లాలో, కేసులు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 13 మందికి, దాచేపల్లిలో ఒకరికి వైరస్‌ సోకినట్టు నిర్ధరించామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ తెలిపారు. అలాగే ఇద్దరు చనిపోయారు. మొత్తంగా, తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 71కి చేరిందన్నారు. ఈ రోజు వచ్చిన కేసులలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారిలో.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నట్టు చెప్పారు. దీంతో కలెక్టర్ కీలక నిర్ణయం ప్రకటించారు. రేపు గుంటూరు జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉంటుందని... నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు సైతం అందుబాటులో ఉండవని కలెక్టర్ పునరుద్ఘాటించారు. రానున్న రోజుల్లో వైరస్‌ తీవ్రతను బట్టి రోజు విడిచి రోజే నిత్యావసరాల విక్రయం అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు గుంటూరు నగరంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. మొత్తంగా, గుంటూరు నగరంలోనే 53 పాజిటివ్ కేసులున్నాయి.

రేపు ఆదివారం, చికెన్, మటన్ షాపులు కూడా ఉండవని, కలెక్టర్ చెప్పారు. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని, ప్రజలకు కావాల్సినవి అన్నీ అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ చెప్పారు. అవసరం అయితే, రేపటి నుంచి రోజు మార్చి రోజు, మాత్రమే, బయటకు వదులుతాం అని అన్నారు. ఇది ఇలా ఉంటే, గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లేందుకు అధికారులు అధునాతన సాంకేతిక పద్ధతిని పాటించారు. కేసులు నమోదైన వీధిలో అధికారులు డ్రోన్ సహాయంతో హైపో క్లోరైడ్ ద్రావణం చల్లించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ డ్రోన్లను రూపొందించారు. పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని, గుంటూరు అర్బన్ ఏఎస్పీ ఈశ్వర్​రావు ఈ పనులను పర్యవేక్షించారు.

కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా పోలీసులు లాక్​డౌన్​ను కఠినతరం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కఠిన నిర్ణయం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే పాక్షికంగా అనుమతి ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు నియంత్రించారు. రెడ్​ జోన్​ ప్రాంతాలైతే కర్ఫ్యూ వాతావరణం తలపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఆంక్షలతో లాక్​డౌన్​ను అమలు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూలీలు తీసుకెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్​ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు.

ప్రపంచం అంతా, కరోనా పై యుద్ధం చేస్తుంది. మన దేశంలో కూడా, కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. మన రాష్ట్రంలో కేసులు 400 దగ్గరకు వచ్చాయి. కమ్యూనిటీ స్ప్రెడ్ కు, అవకాసం ఉన్న ఈ టైంలో, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, రాజకీయం వైపు మళ్ళింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే, అనుకున్న పని చేసేసింది. ఇంత ప్లాన్ వేసి, చెయ్యల్సినంత అర్జెంట్ ఏముంది ? అంటూ ప్రజలు అనుకుంటున్నారు. నిన్న మధ్యానం గవర్నర్ వద్దకు ఆర్దినెన్స్ వెళ్ళటం, వెంటనే ఆమోదం పొందటం, తరువాత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు, నియామకం, వేతనం చెల్లింపు అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాటం జరిగిపోయింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్​ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది.

ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన వారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్ళకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్‌, నోటిఫికేషన్‌ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. అన్నింటినీ అత్యంత రహస్యంగా ఉంచిన ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం కావడం వల్ల బహిర్గతం చేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ మంత్రివర్గ ఆమోదం కోసం ఈనెల 7న పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రతిపాదన పంపించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రులకు గురువారం పంపించారు. ఎవరి నుంచీ అభ్యంతరాలు లేనందువల్ల ఆమోదం పొందినట్లు నిర్ధరించారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు సమయం లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా అనుసరించే ఈ పద్ధతిని 'షార్ట్ సర్కులేషన్ మెథడ్' అంటారు. గురువారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై తదుపరి కార్యాచరణ నిర్ణయించినట్లు సమాచారం. అదేరోజు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శుక్రవారం ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ చకాచకా జరిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కరోనా పాజిటివ్ కేసులు 400 మార్క్ దాటింది. ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు 402కు చేరాయి. నిన్న రాత్రి 9 నుంచి ఉదయం వరకు 21 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 72 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 82 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 41 కేసులు నమోదు అయ్యాయి. కడప జిల్లాలో కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. కడప జిల్లాలో ఇప్పటివరకు 30 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలను అందిస్తున్నారు. రెడ్‌జోన్లలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రత్యేకించి ఒంగోలులో పరిస్థితి దారుణంగా ఉంది.

ఇస్లాంపేటలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా.. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​ జోన్​గా ప్రకటించారు. ఈ పేటలోకి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు పూర్తిగా మూసేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ నిత్యావసర సరకుల పంపిణీకి చర్యలు చేపట్టారు. బండ్లమిట్ట, కొండమిట్ట, ఇందిరమ్మ కాలనీ, పీర్ల మాన్యం ప్రాంతాలనూ రెడ్‌ జోన్లుగా ప్రకటించినందున ఆయా చోట్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన రెడ్‌ జోన్లు, చెక్‌పోస్టులను శిక్షణ ఐపీఎస్‌ అధికారి జగదీష్‌, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌తోపాటు ఒకటో పట్టణ, రెండో పట్టణ, తాలూకా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు భీమానాయక్‌, రాజేష్‌, లక్ష్మణ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ శుక్రవారం ద్విచక్ర వాహనంపై అంజయ్య రోడ్డు, లాయర్‌ పేట, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌, కోర్టు సెంటర్‌, గాంధీ రోడ్డు, ట్రంకు రోడ్డు, ఇస్లాంపేట, బండ్లమిట్ట, కర్నూలురోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు.

ఇక మరో పక్క, దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రాల్లోని పరిస్థితులు, త్వరలో 21 రోజుల లాక్​డౌన్​ ముగుస్తుండటం వంటి అంశాలపై చర్చించారు ప్రధాని. ఈ భేటీ అనంతరం మోదీ మరోమారు జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు ఇచ్చాయి. అయితే ఆంక్షల విషయంలో ఈ సారి అనేక మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే, తొలిసారిగా మోదీ మాస్కుతో దర్శనమిచ్చారు. ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నప్పుడు మాస్కును ధరించారు. ఈ రోజు సాయంత్రం, ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడే అవకాసం ఉందని తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read