ఆంధ్రప్రదేశ్ లో, గత మూడు నలుగు రోజులుగా, తక్కువుగా చెప్తున్నా కరోనా కేసులు, ఈ రోజు ఒకేసారి ఎక్కువగా నమోదు అయ్యాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 34 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 16 నమోదవగా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 109 కు పెరిగింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదవగా... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 91కి చేరింది. అనంతపురం జిల్లాలో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదవగా... మొత్తంగా 17 కేసులకు పెరిగింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవగా... మొత్తంగా 56 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 42 కేసులు, కడప జిల్లాలో ఇప్పటివరకు 31 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 17 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు, చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కేసులు, విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత వాహనాలను రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారిని గుర్తింపు కార్డులు, పాస్‌లు ఉంటేనే అనుమతిస్తున్నారు. జిల్లాలో 109 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటిలో గుంటూరు నగరంలోనే 68 ఉన్నాయి. కేసుల ఉద్ధృతితో నగరంలో ప్రతి అర కిలోమీటరుకు ఓ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ విషయంలో మొదట్లో కొంత ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగానే.. కేసులు విపరీతంగా పెరిగాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రజలు బయటకు రాకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
నిత్యావసరాల కోసం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. సమీప ప్రాంతాల్లోనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇవాళ్టి నుంచి నిత్యావసరాల కొనుగోలుకు సరి-బేసి విధానం అమలు చేస్తున్నారు. సరి సంఖ్య తేదీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొనుగోళ్లకు అనుమతిస్తారు. బేసి సంఖ్య తేదీల్లో రోజంతా పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరోనాను కట్టడి చేయాలంటే కొద్దిరోజులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. మరో పక్క, కరోనా సోకి చెన్నైలోని గ్రీమ్స్రోడ్డు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెల్లూరు వైద్యుడు సోమవారం ఉదయం 4 గంటలకు మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ ఈ విషయాన్ని నిర్ధారించారు.