అమరావతి అంటే ఎలేర్జీ... పట్టిసీమ అంటే దండగ... ఇలాంటే స్టేట్మెంట్లు ఇచ్చి, రాజధాని రెండు జిల్లాల్లో అభ్యర్ధులు లేకుండా చేసుకున్నాడు జగన్. జనాలని తోలి, కనకదుర్గ బ్రిడ్జి ఊగిపోయింది అని హడావిడి చెయ్యటంలో ఉన్న శ్రద్ద, అభ్యర్ధులకి నమ్మకం కలిగించటంలో లేదు. అధికార టిడిపిలో లెక్కకు మించి అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండగా, వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి కొన్ని చోట్ల పోటీకి అభ్యర్థులు దొరకడం లేదు. అసెంబ్లీకి పోటీ చేయడానికి కొన్ని చోట్ల అభ్యర్థులు ముందుకు వస్తున్నా, పార్లమెంట్‌కు పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు.

jagan 18082018 2

రాజధానిలో కీలకమైన ఈ జిల్లాల్లో ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడం, ఆ పార్టీ స్థితిని తెలియజేస్తోంది. గుంటూరు, కృష్ణాలో మొత్తం ఐదు స్థానాలు ఉండగా, వైకాపా తరుపున పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు లేరని ఆ పార్టీనేతలే వాపోతున్నారు. ఐదు స్థానాల్లో ఒక్కస్థానం నుంచైనా, ఫలానా వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లోనూ వైకాపా ఓటమిని చవిచూసింది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని గుంటూరు,నర్సరావుపేట, బాపట్ల నియోజకవర్గాల నుంచి 'వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వరికూటి అమృతపాణిలు పోటీ చేశారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి కొలుసు పార్థసారధి, విజయవాడ నుంచి కోనేరు రాజేంద్రప్రసాద్‌లు పోటీ చేసి ఓడిపోయారు.

jagan 18082018 3

పార్థసారధి మినహా, ఈ అదుగురు గత నాలుగున్నరేళ్ల నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. మిగతా వారెవరూ, మళ్లీ వైకాపా గడప తొక్కిన పాపాన పోలేదు. దీంతో, ఈ ఐదుగురు మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఐదుస్థానాలకు ఐదుగురు కొత్త వారిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వైకాపాకు ఉంది. అయితే, ఇక్కడ టిడిపిని ఎదుర్కొనే దమ్మున్న నాయకులెవరూ వైకాపాలో లేరు. అదే సమయంలో పోటీ చేయడానికి వ్యాపారవేత్తలు కానీ, ఇతర నాయకులు కానీ రావడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక, మాజీ కాంగ్రెస్‌ నేతలు, ప్రస్తుతం బిజెపిలో ఉన్న నేతలను పోటీ చేయమని వైకాపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాయబారాలు నడుపుతున్నారు.

ఏపీలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టిసారించారు. అందులో భాగంగానే ఆయన ఏడు జిల్లాలకు బాధ్యులను నియమించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రటించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో బాధ్యులను ప్రకటించనున్నారు. అయితే పార్టీ పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారట. 2014 నుంచి పార్టీకోసం పనిచేసిన తమకు న్యాయం జరగలేదని వారు ఫీలవుతున్నారట. పవన్‌కల్యాణ్ క్రియాశీలకంగా లేకుండా, హైదరాబాద్ లో సినిమాలు తీసుకుంటున్నప్పుడు కూడా తాము జిల్లాల్లో కార్యక్రమాలు చేశామని గుర్తుచేస్తున్నారట. అలాంటి తమను కాదని కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు పదవులు దక్కాయని జనసైనికులు ఆవేదన చెందుతున్నారట.

pk 18082018 2

గత నాలుగేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరించిన వారికంటే ప్రజారాజ్యంలో పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కులాల ప్రస్తావన లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్తోన్న పవన్‌కల్యాణ్ ఒకే సామాజికవర్గానికి చెందినవారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని జనసేన శ్రేణులు చెవులు కొరుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన 80 శాతం మందికి పదవులు దక్కాయట! వ్యయప్రయాసలకు ఓర్చి తాము గత నాలుగేళ్ళుగా పార్టీ అస్తిత్వాన్ని కాపాడుతూ వచ్చామనీ.. ‌అలాంటి తమను కాదని వేరే వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వడమేంటనీ కొందరు గట్టిగా ప్రశ్నిస్తున్నారట కూడా!

pk 18082018 3

ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి కొందరు నేతలు హైదరాబాద్‌ వచ్చి జనసేన అధినేతని కలవాలని ప్రయత్నించారట. అయితే వారిని పవన్‌ దగ్గరకు వెళ్ళకుండానే కొందరు నిలువరించి, వెనక్కి పంపారన్నది విస్వసనీయ వర్గాల కథనం! దీంతో అసంతృప్త నేతలు తీవ్ర నిరాశ చెందారట. తమ పార్టీ అధినేత చుట్టూ అప్పుడే కనిపించని గోడలు ఏర్పడ్డాయని వారు బలంగా భావిస్తున్నారట! హైదరాబాద్‌లో పవన్‌ని కలవాలన్న తమ ప్రయత్నం విఫలం కావడంతో అసంతృప్త నేతలు వేరు మార్గం ఆలోచించారట. జిల్లాల పర్యటనకు పవన్‌ వచ్చినప్పుడే ఆయన వద్ద మన మనోభావాలు వ్యక్తంచేయాలని తలపోస్తున్నారట. చూద్దాం వారి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో.

 

పోలవరం ప్రాజెక్టు పనుల పై వస్తు జీఎస్‌టీ దెబ్బ పడుతోంది. ప్రధాన పనుల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలు జంకుతున్నాయి. ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణ పనుల్లో తమకు మిగలడం మాటెలా ఉన్నా, జీఎస్‌టీ దెబ్బతో కోట్లలో నష్టం వాటిల్లుతుందని అవి చెబుతున్నాయి. వీటి పనుల్ని మరో నిర్మాణ సంస్థ ‘రత్న’తో చేయిస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ట్రాన్‌స్ట్రాయ్‌, జీఎస్‌టీ లెక్కలు వేశాక తటపటాయిస్తోంది.ఈ పనులు చేపట్టడానికి తానూ రెడీ అన్న నవయుగ సంస్థ కూడా వెనకాముందూ ఆడుతోంది. 2010-11 ధరల ప్రకారం వీటి పనులు చేపడితే.. యూనిట్‌కు రూ.12 నుంచి రూ.18 దాకా నష్టం వాటిల్లుతుందని.. నష్టం మొత్తం రూ.వందల కోట్లలో ఉంటుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. కాంట్రాక్టు సంస్థలపై భారీగా భారం పడుతోందని, ఫలితంగా నిర్మాణాలకు సంస్థలేవీ ముందుకు రావడం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

polavaram 18082018 2

గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరు 1 నుంచి కాఫర్‌ డ్యాంలు, రాక్‌ఫిల్‌ డ్యాం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు అక్టోబరు మొదటి వారానికే యంత్రాలు, ఇతర వాహనాలను కాంట్రాక్టు సంస్థ సిద్ధం చేసుకోవాలి. అలా చేయాలంటే సెప్టెంబరులోనే నిర్మాణ సంస్థను గుర్తించాలి. ఈలోగా వాటి డిజైన్లను సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా అధికారులు ఈ దిశగా అడుగులు వేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, కాఫర్‌ డ్యాం, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులకు 60-సీ కింద ట్రాన్‌స్ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలా.. లేక నామినేషన్‌ విధానంలో పనులు కట్టబెట్టలా అనేది జల వనరుల శాఖ తేల్చుకోలేకోపతోంది.

polavaram 18082018 3

గతంలో స్పిల్‌ వే, చానల్‌ కాంక్రీట్‌ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమైనప్పుడు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ దానికి సమ్మతించలేదు. దీంతో పాతధరలకే చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను క్షేత్రస్థాయిలో బేరీజు వేయడానికి కేంద్ర జల సంఘం బృందం ఈ నెలాఖరులో లేదా సెప్టెంబరు మొదటి వారంలో పర్యటనకు రావచ్చని తెలిసింది. తుది అంచనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం కోరిన ఫార్మాట్‌లో సమాచారం ఇస్తున్న అధికారుల బృందం.. మరో దఫా ఢిల్లీ వెళ్లనుంది.

 

వారం రోజుల క్రితం విజయవాడ పోలీసులు, ప్రజలు త‌మ సమస్యలను పోలీసులకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు నూతన వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సమస్య ఉంటే 7328909090 నంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపాలని ఈ సంద‌ర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ప్రజల సౌకర్యార్థం విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబరుకు జనాల నుంచి ఊహించని బెడద ఎదురవుతుండటంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ప్రజలు 'గుడ్‌మార్నింగ్‌', 'గుడ్‌నైట్‌', 'కంగ్రాట్స్‌' మెసేజ్‌లు పెడుతున్నారట. అసలు ఫిర్యాదుల కన్నా ఈ కొసరు మెసేజ్ లు పోటెత్తుతుండటంతో పోలీసులు అల్లాడిపోతున్నారట.ప్రజలు తమని ఇలా శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నందుకు సంతోషపడాలో, ఫిర్యాదుల కన్నా ఇలా అనవసరమైన మెసేజ్ లు ఇస్తున్నందుకు బాధపడాలో అర్ధం కాక తలపట్టుకుంటున్నారట.

wa 180802018 2

విజయవాడ పోలీస్ వాట్సాప్‌ నెంబరుకు నాలుగు రోజులుగా మొత్తం 532 మెసేజ్‌ల రూపంలో ఫిర్యాదులు వచ్చాయి...ఇందులో 363 మెసేజ్‌లు కేవలం పోలీసులను అభినందిస్తూ ‘కంగ్రాట్స్‌.. గుడ్‌మార్నింగ్‌.. గుడ్‌నైట్‌' అంటూ వచ్చాయి, తొలిరోజు గురువారం అత్యధికంగా 140, శుక్రవారం 128, శనివారం 69, ఆదివారం 26 వచ్చాయి. ఇవే కాకుండా మరో 140 మెసేజ్‌లు విజయవాడ నగరం వెలుపల నుంచి వారి పరిధిలోకి రాని ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. ఇలా అనవసర మెసేజ్‌ వల్ల దీనిని ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుందని, ఎవరికైనా సమస్యలుంటేనే ఈ నెంబరుకు మేసేజ్‌లు పెట్టాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

wa 180802018 3

మిగతా సమస్యలు,ఫిర్యాదులకు పరిష్కారం విషయం అటుంచితే ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతోందట. ట్రాపిక్ ఇబ్బందుల గురించి ఈ వాట్సాప్‌ నెంబరుకు మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయని...అందులో అత్యధికంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు, ట్రాఫిక్ జామ్ లను తెలుపుతూ సందేశాలు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇలా విజయవాడ నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలకు సంబంధించి 14 మేసేజ్‌లు రాగా...వాటన్నింటినీ పోలీసులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించారట. అలాగే శాంతిభద్రతలకు సంబంధించి 12 రాగా...వాటిలో ఎనిమిదిటిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read