ఆంధ్రప్రదేశ్ లో, సంవత్సరం ముందే ఎన్నికల హడావిడి మొదలైంది. చక్కగా సాగిపోతున్న ఆంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానంలో, బీజేపీ తన పగ తీర్చుకోవటం మొదలు పెట్టటంతో, చంద్రబాబు ఎదిరించి, మన హక్కులు అడిగారు. ఇదే బీజేపీ పార్టీకి ఇబ్బంది అయ్యింది. దీంతో ఢిల్లీ నేతలు, ఇక్కడ కొన్ని పార్టీల చేత, ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి మొదలు పెట్టించారు. వీరిని ఉపయోగించుకుని చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ప్లాన్. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే, పొత్తుల కోసం ప్రజలని ప్రిపేర్ చేస్తున్నారు. జగన్-పవన్-బీజేపీ, వీరి ముగ్గురూ కలిసి పోటీ చెయ్యటం, లేదా ఏదైనా రెండు పార్టీలు కలిసి పోటీ చెయ్యటం అనేది దాదాపు ఖరారు అయ్యింది. ఒకేసారి ఈ అపవిత్ర పొత్తు గురించి చెప్తే, వారి అభిమానులు తట్టుకోలేరు కాబట్టి, ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు...
అందుకు నేతల వ్యాఖ్యలే నిదర్శనం. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. జనసేన అధినేత జగన్‌కు మద్దతిచ్చేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు అవినీతి జనసేనానికి నచ్చలేదని, జగన్ కష్టం నచ్చింది అని ఆయన అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్‌లు వచ్చే ఎన్నికల్లో కలుస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరో పక్క, కమ్యూనిస్ట్ పార్టీలు, మేము పవన్ తో కలిసి వెళ్తాయి అని చెప్తున్నాయి. కాని, వారికి పవన్ పై అనుమానాలు మాత్రం పోవటం లేదు. ఎందుకంటే, ఇప్పటి వరకు, పవన్, బీజేపీని ఒక్క మాట కూడా అనటం లేదు. బద్ధ శత్రువులు అయిన, కమ్యూనిస్ట్-బీజేపీల పొత్తు అనేది కుదరదు. అందుకే, కమ్యూనిస్ట్ లు, బయటకు పవన్ తో కనిపిస్తున్నా, లోపల మాత్రం, పవన్ పై అనుమానంతోనే చూస్తున్నారు. ఇప్పుడు, బీజేపీ ఒక్కటే కాదు, వైసిపీతో కూడా పవన్ పొత్తు అనే ప్రచారం మొదలైంది. దీన్ని ఇరు పార్టీలు ఖండించలేదు.
ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ సోమవారం ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, జగన్ కలిస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ పార్టీ పని అయిపోయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఇరు పార్టీల పొత్తు సరికాదని అభిప్రాయపడ్డారు. జగన్ ధ్యాస అంతా ముఖ్యమంత్రి పదవి సీటుపైనే ఉందని రామకృష్ణ మండిపడ్డారు. ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వెల్లడించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచేశారని నిప్పులు చెరిగారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పవన్ జతకడితే జనసేన కథ ముగిసినట్లేనని ఆయన హెచ్చరించారు.