ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగానిదే కీలకపాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యాంకులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. రుణ మంజూరు పత్రాలతో వెళ్లినా బ్యాంకులు సకాలంలో స్పందించడం లేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెస్తోందని, బ్యాంకులు ఈ విషయంలో తమ పనితీరు మార్చుకోవటానికి వచ్చే నెల 31 వరకు సమయమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
కొన్ని ప్రైవేటు బ్యాంకులు అభివద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం లేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఒక్క రైతుపేరిట కూడా ఆ బ్యాంకులు ఖాతాలను ప్రారంభించలేదని అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతూ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనకపోవడం సరికాదని తెలిపారు. అటువంటి బ్యాంకులను నియంత్రించలేకపోతున్నామన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఆయా బ్యాంకులు ఏఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తాయో అందుకు సంబంధించి సేవాస్థాయి ఒప్పందాల (Service level Agreement) ను వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరతామని, ఆయా బ్యాంకుల దగ్గరకు వెళ్లవద్దని తాము కూడా ప్రజలకు తెలియజేస్తామని, ఆయా బ్యాంకులలో అక్కౌంట్లు ప్రారంభించవద్దని సూచిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కొన్ని బ్యాంకులు అనేక కారణాలు చెబుతూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇటువంటి అదనపు చార్జీల విధింపు పద్ధతులను మానుకోవాలని బ్యాంకులకు సూచించారు. ముప్ఫయ్ వేల రూపాయలతో గేదెల కొనుగోలుకు రుణం ఇవ్వడానికి గేదెల తనిఖీ చార్జీల కింద ఓ బ్యాంకు రూ.12,000 చార్జిచేసిందని ఓ అధికారి చెప్పినప్పుడు సమావేశంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ తగిన ఆధారాలతో వస్తే సదరు బ్యాంకు అధికారుల మీద చర్య తీసుకునేందుకు వీలవుతుందన్నారు. రుణ ఉపశమనం కింద మంజూరు చేసిన మొత్తంలో ఇంకా 16 కోట్లు బ్యాంకర్ల దగ్గరే ఉన్నాయని, వెంటనే లబ్దిదార్లకు అందజేయాలన్నారు.
బలహీన వర్గాల ప్రజలు రుణాలు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి చెబుతూ ‘రుణాలు తీసుకోవటం, తిరిగి చెల్లించటం ఉండాలి. తిరిగి చెల్లిస్తేనే బ్యాంకులు రీషెడ్యూల్ చేసుకుంటాయి. లేకుంటే బ్యాంకులు పనిచేయటం సాధ్యంకాదు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల చెల్లింపు విషయంలో మాకు స్పష్టత ఉంది. అధికారులు సకాలంలో స్పందిస్తూ, సత్వర చెల్లింపులతో బ్యాంకులు సాఫీగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.