కొన ఊపిరితో ఉన్న రాయలసీమ రైతాంగానికి కృష్ణమ్మ ఊపిరి పోసింది. ఎగువన పశ్చిమ కనుమలు, మంత్రాలయం, కర్నూలులో కురిసిన స్థానిక వర్షాలతో శ్రీశైలం వద్ద అంతకంతకూ వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది... ఈ నీరంతా రాయలసీమ రైతాంగం కోసమే ఉపయోగించనున్నారు... పట్టిసీమతో కృష్ణా డెల్టాకి సరిపడా నీరు ఉడటంతో, ఈ నీరు మొత్తాన్ని రాయలసీమ అవసరాల కోసమే వాడనున్నారు....
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 858.4 అడుగులు ఉంది. శ్రీశైలం డ్యాములోనికి 1,89,916 క్యూసిక్స్ వరద నీరు కొనసాగుతోంది. డ్యాములో ప్రస్తుతం 101 టీఎంసీ ల నీరు ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల కు డ్యాములోనికి 1,89,916 క్యూసిక్స్ నీరు చేరుతోంది.
రాయలసీమ జిల్లాల్లోని సాగు, తాగు నీటిని అందించే ప్రాజెక్టులైన తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, కెసి కెనాల్‌కు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు శ్రీశైలం జలాలు చేరుకున్నాయి. మంగళవారం లేదా బుధవారం పోతురెడ్డిపాడు నుంచి కాలువలకు నీళ్లు వదిలే అవకాశం ఉందని సమాచారం.
ఎగువన జూరాల, నారాయణపూర్, ఆల్మట్టిల వద్ద వరద ప్రవాహం భారీ ఎత్తున ఉండడంతో శ్రీశైలం జలాశయంలోకి మరోవారం రోజులపాటు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం డ్యాంకు నీరు రాకతో నాగార్జున సాగర్ కుడి కాలవ క్రింద రైతులు మరియు రాయలసీమ రైతులలో ఆనందము వ్యక్తమౌతోంది.