"ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో... అప్పుడు ఆదాయం పెరుగుతుంది.. ఆదాయం పెరిగితే ఉపాధి పెరుగుతుంది... తద్వారా సంక్షేమ పధకాలను అమలు చేయవచ్చు.." నంద్యాల కృతజ్ఞతా సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అక్కడి ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించినందుకు గాను ముఖ్యమంత్రి ఈ రోజు నంద్యాల పర్యటనకు వెళ్లారు...
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి కొన్ని ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలని,‘శాశ్వతంగా మీ గుండెల్లో నాకు కొంత చోటు కావాలనే ఏకైక ఆకాంక్షతో పనిచేస్తున్నానని ’ అన్నారు. అదే విధంగా ప్రతిపక్షంపై కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతిపక్షం ప్రతి రోజూ విమర్శలు చేస్తోందని, అయినా అవేమీ పట్టించుకోనని, ప్రజల సంక్షేమమే తనకు కావాల్సిందని అన్నారు.
అదే విధంగా ఏపీలో కష్టాలు, సమస్యలు ఉన్నాయని, అలాగని భయపడితే జరిగేది ఏమీ లేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింభవళ్లు కష్టపడుతున్నానని చెప్పిన చంద్రబాబు మూడేళ్లలో చూస్తే భారత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి జరిగిందని, అది తెలుగుదేశం పార్టీ సత్తా అని అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని తానిచ్చిన హామీని తప్పక నెరవేరుస్తానని స్పష్టంచేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే పొదుపు సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టానని గుర్తుచేశారు.