ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల్లో కొత్త గుబులు పట్టుకుంది. సహజంగా ప్రజా వ్యతిరేకత విషయంలో, ఎవరికైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం, వరుస ఆడియో లీక్‌లతో, ఇబ్బందులు పడుతున్నారు. అవి నిజమో కాదో, ఇప్పటికీ తెలియదు కానీ, నేతలు అయితే అవి తమవి కాదని ఖండించి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరి పోలీసులు ఏమి తెలుస్తారో చూడాలి. అయితే ఈ విషయంలో నేతల పరువుతో పాటుగా, వైసీపీ పరువు కూడా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. ముందుగా ఎస్వీబీసి చైర్మెన్ గా ఉన్న పృద్వీని ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చింది. తిరుమలలో ఉంటూ మాట్లాడిన ఆ ఆడియో లీక్ లో, వెనుక నుంచి వాటేసుకుంటా అనే డైలాగ్ హైలైట్ అయ్యింది. అయితే పృధ్వీ మాత్రం, అది తన వాయిస్ కాదని చెప్పారు. ఎంక్వయిరీ కూడా వేయమన్నారు. అయితే ప్రభుత్వం పృధ్వీని తొలగించింది. దీని వెనుక కొంత మంది సొంత పార్టీకి చెందిన వారే ఉన్నారని, పృధ్వీ చెప్పుకొచ్చారు. తిరుమల లాంటి చోట్ల ఈ ఆడియో లీక్ కావటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. ఇది మరచిపోతున్న సమయంలో, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో మరో ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చి, ప్రకంపనలు సృష్టించింది. అందరూ షాక్ తిన్నారు.
అందులో ఎవరో మహిళతో, అంబటి రాంబాబు మాటలుగా చెప్తున్న వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. అయితే ఇది కూడా, ఎవరో గిట్టని వారు చేసారని, దీని పై పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు అంబటి చెప్పుకొచ్చారు. మరి పోలీసులు ఏమి తెలుస్తారో చూడాలి. గతంలో కూడా అంబటి పేరుతో ఒక ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాని పై ఆయన కోర్టుకు వెళ్ళారు. ఇక తాజాగా ఏకంగా మంత్రి అవంతి శ్రీనివాస్ విషయంలో కూడా ఒక ఆడియో బయటకు వచ్చింది. అరగంట వచ్చి వెళ్ళమంటూ ఆ ఆడియోలో ఉంది. అయితే దీని పై అవంతి స్పందిస్తూ, ఇది గిట్టని వారు చేసిన పని అని, పోలీస్ కు కంప్లైంట్ ఇచ్చినట్టు మీడియాతో చెప్పారు. ఇలా వరుస ఆడియో లీకులు వైసీపీలో టెన్షన్ తెప్పిస్తున్నాయి. ఏ నిమిషాన ఏ ఆడియో బయటకు వస్తుందో అంటూ టెన్షన్ పడుతున్నారు. అయితే దీని పై స్పందించిన మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, ఈ ఆడియో టేప్ లు తమవి కాదని నేతలు చెప్తున్నారని, నిజా నిజాలు ఏమిటో తెలవాలని, తాము కూడా ఈ విషయం పై నివేదిక కోరతాం అంటూ చెప్పుకొచ్చారు.