ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, స్పీకర్ పోచారం హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణకు అవమానం జరిగిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మూడో వరుసలో కూర్చోబెట్టి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రోటోకాల్ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. "అసలు స్పీకర్‌కు ఆహ్వానం ఉందా..? పోచారంకు స్పీకర్‌గా కొనసాగే హక్కు లేదు..? వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి. ప్రతిపక్షనేత స్టాలిన్‌కు ఉన్న గౌరవం స్పీకర్‌కు లేదా..?" అని జీవన్ రెడ్డి కన్నెర్రజేశారు.
అంతటితో ఆగని ఆయన టీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బరి తెగించాడన్నారు. స్పీకర్‌కి శాసన వ్యవస్థ అంటే ఏంటో తెలియదని వ్యాఖ్యానించారు. ఒక కుటుంబం కోసమే తెలంగాణ సాధించినట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా ఎమ్మెల్యేల విలీనంపై నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. పోచారానికి స్పీకర్‌గా కొనసాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. ఎంఐఎం మిత్ర పక్షమేనని ప్రతిపక్షం కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. టీఆరెస్- ఎంఐఎం పార్టీలది క్విడ్ ప్రోకో అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.