సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో జిల్లాలో కొన్ని గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పచ్చనిపల్లెల్లో ఎప్పుడు ప్రతీకారేచ్ఛలు భగ్గుమంటాయోనని పల్లె జనం ఆందోళన చెందుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి పల్నాడుతో పాటు డెల్టాలోని పలు చోట్ల వైకాపా వర్గీయులు, తెదేపా వర్గీయులు పై దాడులకు దిగారు. పల్నాడు ప్రాంతంలో రెండు రోజుల నుంచి అనేక పల్లెల్లో రాజకీయ వర్గ వైషమ్యాలు భగ్గుమన్నా పోలీసు పికెట్లు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. నామమాత్రంగా ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను గ్రామాలకు పంపుతున్నారు. వీరు ఎండలకు తాళలేక ఏ చెట్టు కిందో, పంచాయతీ కార్యాలయాల వద్దో వేచి ఉంటున్నారు. ఇదే అదనుగా గ్రామాల్లో పోలీసుల నిఘాలేదని ఇరువర్గాలు ఒకరికొకరు రెచ్చగొట్టుకుని దాడులు చేసుకుంటున్నారు.

శుక్రవారం నరసరావుపేట పట్టణంలో పలు కార్యాలయాలకు కోడెల శివప్రసాదరావు నామపలకాలను వైకాపా కార్యకర్తలు తొలగించారు. ఆ ఘటన మరవకుండానే శనివారం దాచేపల్లి మండలం శ్రీనివాసాపురంలో ఒకే సామాజికవర్గానికి చెందినవారు వైకాపా-తెదేపా వర్గీయులుగా విడిపోయి నడిరోడ్డుపై కత్తులు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకునేసరికి అప్పటికే గొడవలు తీవ్రమై రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు తలలు పగిలాయి. పిరంగిపురం మండలం 113 తాళ్లూరులో వైకాపా-తెదేపా వర్గీయులు ఎదురుపడి కొట్టుకున్నారు. దీంతో ఇక్కడ కూడా కొందరు గాయాలపాలయ్యారు. మొన్న చంద్రబాబు నివాసం వద్ద.. ఓట్ల లెక్కింపు వేళ వైకాపా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగానే తాడికొండ నియోజకవర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని వైకాపా జెండాలతో హడావుడి చేశారు.

వారిని అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు ప్రయత్నించారు. ఆరోజున ఇక్కడ కూడా ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వాదోపవాదనలు జరిగాయి. చివరకు పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించారు. ఫలితాల రోజున ఒక్క చంద్రబాబు నివాసం వద్దే కాదు.. పిడుగురాళ్లలో ఓ భోజన హోటల్‌పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఇది తెదేపాకు చెందిన నాయకుడిది. దీంతో స్థానిక వైకాపా నేతలు రెచ్చిపోయి ఆ రెస్టారెంట్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నరసరావుపేట మండలం దొండపాడులో కొందరు తెదేపా కార్యకర్తలను ఉద్దేశించి ‘ఈనెల 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం ఉంది. ఆ రోజున మిమ్మల్ని కొడతామని’ ముందుగానే వైకాపా శ్రేణులు హెచ్చరికలు చేసినట్లు చెబుతున్నారు. గత రెండురోజుల నుంచి మాచవరం మండలం పిన్నెల్లి, మోర్జంపాడు గ్రామాలు అట్టుడికిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులు కానున్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జులై 10న జన్మించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు. 2003-2004 వరకూ ఎస్‌ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా పనిచేసిన సవాంగ్‌ ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు.

ap police 26052019

2005-2008 వరకూ సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఏపీ పోలీసు పటాలం అదనపు డీజీగా పనిచేశారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసి తనదైన ముద్రవేసిన సవాంగ్‌... గతేడాది జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ap police 26052019

విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఠాకూర్‌.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లారు.

కేంద్రంలో రెండోసారి సత్తా చాటిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో చతికిలపడింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటూ రాలేదు. పైగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన బీజేపీ రెండు లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులు మంత్రులుగా కూడా పనిచేశారు. అయితే ఈ పొత్తును మొదటి నుంచీ వ్యతిరేకించిన పార్టీలోని ఒక వర్గం.. బీజేపీ సొంతంగా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని ఆనాడు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ విధంగానే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కమలనాథులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు దేశమే ముఖ్యమని, ఆ దిశగా చేసిన ప్రయత్నంలో మోదీకి రెండోసారి అవకాశం దక్కిందని బీజేపీలోని అసలైన పార్టీ వాదులు సంతృప్తి పడుతున్నారు.

bjp 25052019 1

పార్టీలోకి వలస వచ్చిన వారు మాత్రం డిపాజిట్లు రాక, తమకు ఎక్కడా విలువ ఉండదని పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్న ప్రధాని మోదీ చివరి బడ్జెట్‌లో దానిని చేర్చలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకొచ్చింది. అక్కడ సుజనా, అశోక్‌గజపతిరాజు, ఇక్కడ కామినేని, పైడికొండల తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ విధంగా టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా బలపడాలని భావించిన అధిష్ఠానం కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభకు పోటీ చేసిన కన్నాకు డిపాజిట్‌ దక్కలేదు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లలో చేయని సాయం ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రులు గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు ప్రచారానికి వచ్చి కేంద్రసాయంపై తలోమాట, తమకు తోచిన లెక్కలు చెప్పారు.

bjp 25052019 1

చివరకు రైల్వేజోన్‌ విషయంలో చేసిన ప్రకటననూ ప్రజలు విశ్వసించలేదు. బీజేపీని ఎక్కువగా ఆదరించిన విశాఖ (ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) వాసులు.. ఈ ఎన్నికల్లోనూ కరుణిస్తారని భావించి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని ఎంపీగా బరిలో దించారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మినహా బీజేపీ అభ్యర్థిని విశాఖ వాసులు గుర్తించలేదు. ఇదే వైఖరి 25 లోక్‌సభ, ఆ పార్టీ పోటీ చేసిన 174 అసెంబ్లీ స్థానాల్లోనూ కనిపించింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న విష్ణుకుమార్‌రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. దీంతో ‘పొత్తు లేకుండా ఒంటరిగా ఆంధ్రప్రదేశ్‌లో గెలవలేం’ అని ఈ ఫలితాలను చూసిన కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. 1999లోనూ టీడీపీతో పొత్తుపెట్టుకునే గెలిచామని గుర్తు చేస్తున్నారు. పొత్తు వద్దని వారించిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు.

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. భవన నిర్మాణంలో లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడంతో పాటు పలు ఇతర వసతుల లేమి కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉండగా.. భవనంలో మంటలు ఎగిసిపడుతున్నా.. అగ్నిమాపక సిబ్బంది చాలా సేపటి వరకు రాలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనాస్థలాన్ని చేరుకునేందుకు 45 నిమిషాల సమయం తీసుకున్నారని అన్నారు.

surat 26052019 1

‘భవనంలో మంటలు చెలరేగిన తర్వాత దట్టమైన పొగ అలుముకుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఓ నిచ్చెన వేసుకుని కొంతమంది పిల్లలను బయటకు తీసుకొచ్చాను. ప్రమాదం జరిగిన శిక్షణ కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోనే అగ్నిమాపక కార్యాలయం ఉంది. అయినప్పటికీ వారు ఫోన్‌ చేసిన 45 నిమిషాలకు ఘటనాస్థలానికి వచ్చారు’ అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి వచ్చి ఉంటే ఇంకొంత మంది బతికి ఉండేవారేమోనని మరో ప్రత్యక్ష సాక్షి విచారం వ్యక్తం చేశారు.

surat 26052019 1

సూరత్‌లోని సర్తానాలో గల ఓ శిక్షణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఏసీల్లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మొదలైన మంటలు క్రమంగా భవనం అంతా వ్యాపించాయి. ఘటన సమయంలో భవనంలో కనీసం 50 మంది విద్యార్థులున్నారు. వీరంతా 20ఏళ్ల లోపువారే. ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతవగా.. పలువురు గాయపడ్డారు. భవనంలో ఒక వైపు నుంచే మెట్లు ఉండటంతో పాటు అవన్నీ చెక్కతో చేసినవి కావడంతో మంటలు చూస్తుండగానే వ్యాపించాయి. దీంతో విద్యార్థులకు తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read