కూకట్పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా, దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను గురువారం అక్కడికి పిలిపించి మాట్లాడారు. ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించే ముందు హరికృష్ణ తనయులు, సినీనటులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్లతోనూ చంద్రబాబు చర్చించారు. అయితే ముందుగా ఇక్కడ కళ్యాణ్‌రామ్ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా, కుటుంబం అబిప్రాయం మేరకు సుహాసిని వైపు చంద్రబాబు మొగ్గు చెపారు.
సుహాసిని బరిలోకి దింపడం ద్వారా సీఎం చంద్రబాబు వ్యాహాత్మకం ప్రత్యర్థులను డిఫెన్స్‌లోకి పడేశారు. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో పురందేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపైనే ఉన్నారనే సంకేతాలను టీడీపీ ఇచ్చినట్లయింది. ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, అప్పుడు కాంగ్రెస్ ఆ అహంకారం చూపిస్తే, ఇప్పుడు బీజేపీ ఆ అహంకారం చూపిస్తుందని, అందుకే కాంగ్రెస్ తో కలిసి, మోడీ-షా లను ఎదుర్కుంటుంది తెలుగుదేశం. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా, పార్టీ వెంటే ఉందని అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని చంద్రబాబు ఆలోచన. ఇది ఒక్కటే కాదు హరికృష్ణను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా ఇచ్చినట్లయింది.
కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందన్న విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు, నందమూరి కుటుంబసభ్యులను ప్రచారంలోకి దింపాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో మహాకూటమి విజయానికి దోహదపడాలంటే సుహాసినిని అభ్యర్ధిగా ప్రకటిస్తే అన్ని స్ధానాలపై ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అంతేకాకుండా మిగతా అభ్యర్ధులకు కూడా సుహాసిని బరిలోకి దిగడం కలిసివస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. మరోవైపు మహాకూటమి తరపున బాలకృష్ణ కూడా ప్రచారం నిర్వహిస్తారని టీటీడీపీ నేత ఎల్. రమణ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో హరికృష్ణ కూడా టీడీపీ నుంచి ఎంపీగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఆయన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు భావించారు. సుహాసినికి కూకట్పల్లి అభ్యర్థిగా ప్రకటించడంతో హరికృష్ణ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే నల్గొండ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు లేవు. అయితే ఆయన మనవరాలు సుహాసిని తెలంగాణ నుంచి రెండో సారి ప్రాతినిధ్యం వహించబోతున్నారు.