ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవీఎల్ నరసింహారావు అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య స్నేహం బాగా ఉన్న టైంలో, చిచ్చు పెట్టిన మొదటి వ్యక్తి ఈయనే. ఈయన బీజేపీ అధికార ప్రతినిధి కంటే, వైసీపీ అధికార ప్రతినిధిగానే ఎక్కువగా ప్రజలు ఆయన్ను గుర్తిస్తూ ఉంటారు. ఎప్పుడూ జగన్ కు ఇబ్బంది వచ్చింది అని తెలిసినా, ముందుగా ఈయన వచ్చి, జగన్ కు ఇబ్బంది లేకుండా, అది చంద్రబాబు మీదకు తోసేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సార్లు, ఈయన ఇలా ఎందుకు చేస్తున్నారో ప్రజలకు అర్ధం అయ్యేది కాదు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉంటూ, ఎప్పుడూ వైసీపీ తరుపున ఎందుకు మాట్లాడతారో ప్రజలకు అర్ధం అయ్యేది కాదు. అయితే ఈ మధ్య జగన్, జీవీఎల్ కు భారీ లబ్ది చేసారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నా, అది ఎంత వరకు నిజమో మరి. అయితే ఇప్పుడు జీవీఎల్, జగన్ పై చూపిస్తున్న అత్యుత్సాహానికి, హైకమాండ్ దగ్గర, అక్షింతలు పడ్డాయనే వార్తలు వస్తున్నాయి. ఇది బీజేపీ నుంచి వస్తున్న లీకులు కావటంతో, నిజమే అని నమ్మాల్సిన పరిస్థితి.
చంద్రబాబు పై విశాఖపట్నంలో వైసీపీ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తరువాత రోజే జీవీఎల్ విజయవాడ వచ్చారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, వైజాగ్ లో చంద్రబాబు మీద వైసీపీ దాడి చెయ్యటానికి చంద్రబాబే కారణం అంటూ, కొత్త లాజిక్ చెప్పారు. ఎంత జగన్ ను వెనకేసుకుని వస్తే మాత్రం, ఇలా ఎలా చెప్తారు అంటూ, సొంత పార్టీ నేతలే అనే పరిస్థితి. ఇది ఇలా ఉంటే, ఆ సాయంత్రమే జీవీఎల్ ఒక్కరే వెళ్లి గవర్నర్ ని కలిసారు. అక్కడ ఏమి మాట్లాడారో, ఎవరి పై కంప్లైంట్ చేసారో తెలియదు కాని, ఈ పరిణామం బీజేపీ ఏపి శాఖకు కోపం తెప్పించింది. గవర్నర్ వద్దకు జీవీఎల్ ఒక్కరే వెళ్ళటం ఏమిటి, అనే అంశం పై, హైకమాండ్ కు ఫిర్యాదు చేసారు. ఈ ఒక్క విషయమే కాదు, జీవీఎల్ బీజేపీ ఏపి శాఖ ఒకటి అంటే, ఆయన మరొకటి చెప్పటం కూడా ఇబ్బందిగా మారింది అని చెప్పారు.
ఒక పక్క ఏపి బీజేపీ అమరావతి పై పోరాటం చేస్తుంటే, జీవీఎల్ వచ్చి, జగన్ నిర్ణయానికి జై కొట్టటం పై కూడా, ఫిర్యాదు వెళ్ళింది. మొత్తానికి, ఎప్పటి నుంచో జీవీఎల్ వ్యవహార శైలి గమనిస్తున్న, బీజేపీ హైకమాండ్, తాజగా జరిగిన పరిణామాలతో, ఇక ఉపేక్షించేది లేదని తేల్చేసింది. జీవీఎల్ ను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చినట్టు, బీజేపీ నుంచి మీడియాకు లీకులు వచ్చాయి. మీరు బీజేపీ వాదనను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి కాని, వైసీపీ వాదనను కాదు, అయినా మీకు ఏపి పై స్పందించమనే బాధ్యతలు ఇవ్వలేదు కదా అని, నడ్డా ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే జీవీఎల్ మాత్రం, హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి, అదేమీ లేదు అంటూ, ఇది మీడియాలో ఒక వర్గం చేస్తున్న ప్రచారం అంటూ చెప్పుకొచ్చారు. కాని, మీడియా వర్గాలు, బీజేపీ నుంచే లీకులు రావటంతో, ఇది నిజమో కాదో, ఇక నడ్డా గారే చెప్పాలి.