గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయం, ప్రతి రోజు ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంది. వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ, తాను టిడిపితో కలిసి ఉండలేక పోతున్నానని, తనకు వేరే స్థానం ఇవ్వాలని కోరటం, వెంటనే స్పీకర్ కూడా దానికి అంగీకరించటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అయితే స్పీకర్ నిర్ణయం పై తెలుగుదేశం పార్టీ అసంతృప్తిలో ఉంది. వంశీ, తమ అధినాయకుడు పై చేసిన పరుష పదజాలానికి, అతనకి షోకాజ్ నోటీస్ ఇచ్చామని, అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్తున్నారు. అంతే కాని వంశీని, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వెయ్యలేదని అంటున్నారు. సస్పెన్షన్లో ఉన్నప్పుడు ప్రత్యేక స్థానం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఒక వేళ, పూర్తి బహిష్కరణ వేటు పడితే ఎమ్మెల్యేగా కూడా అనర్హుడేనని చంద్రబాబు చెప్పారు. అయితే ఈ రోజు మీడియా అణిచివేతకు నిరసనగా చంద్రబాబు, గవర్నర్ ని కలవనున్నారు. ఈ సందర్భంలోనే, వంశీని ప్రత్యెక సభ్యుడిగా స్పీకర్ గుర్తించటం పై కూడా, చంద్రబాబు ఫిర్యాదు చెయ్యనున్నారు.
అయితే ఇదే విషయం పై, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ స్పీకర్ కూడా ఒక లేఖ రాసింది. ఇది ఆ లేఖ "గౌ. శ్రీ తమ్మినేని సీతారామ్ గారికి, అసాధారణ పరిస్థితుల్లోగాని, ఏదైనా విపత్కర పరిస్థితి కలిగినప్పుడుగాని ప్రశ్నోత్తరాలను వాయిదావేసి సదరు అంశాన్ని ముందుగా సభలో చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రానికి లబ్ది, విస్త త ప్రజా ప్రయోజనాలు ఉన్న అంశం ఏదైనావస్తే అలాంటి సందర్భాల్లో క్వశ్చన్ అవర్ వాయిదా వేయడం కద్దు. అలాంటిది మంగళవారం(10.12.2019) ఏ అసాధారణ పరిణామం జరగకుండానే, ఏ విపత్కర పరిస్థితి ఏర్పడకుండానే, ఏ ప్రజా ప్రయోజనం లేకుండానే, ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి మరీ శ్రీ వల్లభనేని వంశీమోహన్ కి సభలో మాట్లాడే అవకాశం కల్పించడం తద్భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తుపై గన్నవరం నియోజకవర్గం నుంచి ఎన్నికైన శాసన సభ్యుడు శ్రీ వల్లభనేని వంశీమోహన్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీని సస్పెండ్ చేశామేగాని పార్టీనుంచి బహిష్కరించలేదు. సస్పెన్షన్లోనే ఉన్నాడంటే ఆయన ఇంకా పార్టీ సభ్యుడేననేది మీకు తెలియందికాదు. ఇంకా టిడిపి సభ్యుడిగానే ఉన్నశ్రీ వల్లభనేని వంశీమోహన్ కి మీరు ప్రత్యేకంగా సీటు ఎలా కేటాయిస్తారు..? అసెంబ్లీ రికార్డులలో శ్రీ వల్లభనేని వంశీమోహన్ ఇంకా టిడిపి సభ్యుడే..ఒకవేళ మారిస్తే ఆ విషయం మీరే స్పష్టంగా ప్రకటించాలి. "
"టిడిఎల్పి శాసనసభా పక్షం సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ప్రత్యేక సీటు ఎలా కేటాయిస్తారు..? సభలో ఆయనను ప్రత్యేకంగా ఎలా గుర్తిస్తారు..? శ్రీ వల్లభనేని వంశీమోహన్ మాట్లాడే సమయం కూడా టిడిఎల్పి సమయంలో భాగంగానే ఉంటుంది, మాట్లాడే సభ్యుల జాబితాను టిడిఎల్ పి అందజేస్తుంది. టిడిఎల్పి జాబితాలోనే ఆయన పేరు ఉన్నప్పుడు, 09.12.2019న వక్తల జాబితాలో ఆయన పేరును టిడిఎల్ పి పంపనప్పుడు ఏ విధంగా ఆయనకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చారు..? సీటు ఎలా సెపరేట్ గా కేటాయించారు..? పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాసేలా వ్యవహరించడం గర్హనీయం. ఒకవైపు కొత్త ఒరవడి సష్టిస్తానని చెబుతూ, మరోవైపు నిబంధనలను ఉల్లంఘించడం, సాంప్రదాయాలను కాలరాయడం దురదష్టకరం. రానున్న కాలంలో అయినా ఇటువంటి వివాదాస్పద చర్యలను పునరావతం చేయరాదని, ది 10.12.2019న తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని, వల్లభనేని వంశీమోహన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాం." అంటూ టిడిపి లెటర్ రాసింది.