ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశాల ప్రారంభమే గందరగోళంతో మొదలైంది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలు పై చర్చ జరపాలి అంటూ, కాంగ్రెస్, శివసేన, ఆందోళన వ్యక్తం చేసాయి. ప్రశ్నోత్తరాలను జరగకుండా, నినాదాలు చేసారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే, ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ప్రశ్నోత్తరాలతో పాటుగా, జీరో హవర్ ని కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఉపయోగించుకుని, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలని దేశ స్థాయిలో చర్చకు తెచ్చే ప్రయత్నం చేసారు. ప్రశ్నోత్తరాల సమయంలో, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేశంలోని ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో అన్ని సంస్కృతులని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు. మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని, కేశినేని నాని గుర్తు చేసారు.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగు మీడియం మొత్తం తీసివేసి, అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేసిందని, తెలుగు ఆప్షన్ గా ఉంచి, ప్రజలే నిర్ణయం తీసుకునేలా చెయ్యాలని అన్నారు. త్రిభాషా విధానాన్ని దేశమంతా అమలు చేయాలన్నారు. అయితే, కేశినేని నాని ప్రశ్న పై కేంద్రమంత్రి పోఖ్రియాల్ స్పందిస్తూ, తెలుగు భాష ఉన్నతి కోసం, చాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్, బెనారస్ తదితర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాల అభివృద్ధికి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరో పక్క వైసిపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, తెలుగు అకాడమీ 10వ షడ్యుల్ లో ఉందని, దాని విభజనకు దోహదపడేలా చేసి, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఇక మరో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్, జీరో హావర్ లో, రాష్ట్రంలో మీడియా పై జరుగుతున్న అణిచివేత పై దేశానికి తెలిసేలా, పార్లమెంట్ లో వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు న్యూస్ చానల్స్ పై బ్యాన్ విధించారని టిపారు. టీవీ5, ఏబీఎన్ ఛానళ్ల పై నిషేధం విధించారని, నిషేదాన్ని ఎత్తివేయాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను తోక్కేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 2430 తీసుకు వచ్చిందని తెలిపారు. వాస్తవాలు రాయాలి అన్నా మీడియాని భయపెట్టే స్థాయికి తీసుకు వెళ్ళారని అన్నారు. ఈ జీవో రద్దు అయ్యేలా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గల్లా కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులు పై దాడులు చేస్తున్నారని, ఒక జర్నలిస్టును, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారని పార్లమెంట్ ద్రుష్టికి తీసుకువచ్చారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ, జాతీయ స్థాయిలో, కూడా, జగన్ ప్రభుత్వం పై పోరాటం చేస్తుంది.