మొన్నా మధ్య, హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో, టిడిపి సానుభూతిపరులు ఉంటున్న ఇళ్ళకు అడ్డంగా గోడ కట్టి , వారు లోపలకి, బయటకు వెళ్ళకుండా చేస్తూ, వైసిపీ శ్రేణులు చేసిన ఆటవిక చర్య తెలిసిందే. దీని పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం కూడా, వచ్చి, క్షేత్ర స్థాయి పర్యటన చేసి, ఎంక్వయిరీ చేసి వెళ్లారు. తరువాత, ఒక నెల రోజుల క్రితం, అనంతపురం జిల్లాలో, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటి చుట్టూ, వైసీపీ శ్రేణులు, బండలు పాతిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి మరో ఆటవిక సంఘటన జరిగింది. అది కూడా ఒక ఒంటరి మహిళ ఉంటున్న ఇంటి పై. రాష్ట్రమంతా ఇసుక కొరత ఉంటే, ఇలా ఇళ్ళకు అడ్డంగా గోడలు కట్టటానికి మాత్రం, వీరికి ఇసుక ఎక్కడ నుంచి వస్తుందో మరి. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలో ఈ తాజా సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో వారు బయటకు రాకుండా, లోపలికి వెళ్ళకుండా గోడ కట్టటమే కాదు, ఆ గోడ ముందు, ఇంటి గేటు ఎదురుగా, ఒక గది కూడా కట్టేసారు.
ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో ఈ ఘోర సంఘటనా జరిగింది. ముచ్చుమూరి ఆదిలక్ష్మమ్మ, వెన్నపూస నరసింహం ఎదురు ఎదురుగా ఉత్నున్నారు. అయితే ఆదిలక్ష్మమ్మ ఇంటికి, అక్కడ ఎదురుగా ఉన్న రోడ్డు మధ్యలో కొంత గ్రామకంఠానికి చెందిన ఖాళీస్థలం ఉంది. ఇంటి ఎదురుగా ఉన్న స్థలం కావటంతో, ఈ స్థలాన్ని 30 ఏళ్ల నుంచి ఆదిలక్ష్మమ్మ కుటుంబం ఉపయోగించుకుంటోంది. ఆ మార్గం నుంచి, ఇంట్లోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటివి పల్లెటూరుల్లో చాలా సహజంగా జరిగే పనులు. అయితే ఆదిలక్ష్మమ్మ తన పాత ఇంటిని తొలగించి కొత్తది నిర్మించుకునే సమయంలో, ఈ స్థలం నాది అని, ఇటు వైపు గేటు పెట్టొద్దని నరసింహం అభ్యంతరం పెట్టాడు.
అంతే కాదు, కొన్ని రోజులు క్రిందట ఈ స్థలం నాది అంటూ, ఇంటి ముందు దౌర్జన్యంగా ఇటుకలతో గోడ కట్టాడు. అయితే ఈ స్థలం తమదని, రోడ్డు అవతల ఉండే నరసింహంకు ఈ స్థలంతో ఎలాంటి సంబంధం లేదంటూ ఆదిలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఆ గోడను తొలగించారు. అయితే మరోసారి గోడ కట్టి, అక్కడ ఒక గది కూడా ఏర్పాటు చేస్తున్న సమయంలో, ఇది పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళింది. పామూరు సీఐ శివరామకృష్ణారెడ్డి ఈ నెల 11న తిమ్మారెడ్డిపాలెం వెళ్లి వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి, ఈ వివాదం తేలేదాకా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దని ఆదేశించారు చెప్పారు. పోలీసులు చెప్పినా వినకుండా, నరసింహం గోడ ఎత్తులేపడంతో పాటు గది పై రేకులు కూడా వేసేయటంతో, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళటానికి దారి లేకుండా పోయింది. సిఐ హెచ్చరించినా, వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారని, రెవిన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని, అధికారులు తనకి సాయం చెయ్యాలని ఆదిలక్ష్మమ్మ దీనంగా ఎదురు చూస్తుంది.