ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఘోరంగా ఉల్లంఘిస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి దుయ్యబట్టారు. సింఘ్వి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ లోకసభ ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోవటం లేదు, కేంద్ర మంత్రులు సిగ్గు వదిలి బి.జె.పి ఎన్నికల ప్రణాలిక రచయితలుగా మారినా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆయా మంత్రిత్వ శాఖలు తమ శాఖల పథకాల అమలుసమీక్షా పత్రాలను బి.జె.పి అందజేశాయి, వీటి ఆదారంగా బి.జె.పి ఎన్నికల ప్రణాలిక తయారైంది, ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దమని సింఘ్వి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీకి ప్రభుత్వాధికారులు తోడ్పడటం, పని చేయటం నిషిద్దం, అదే విధంగా పార్టీ ఎన్నికల ప్రణాలిక రూపకల్పనకు మంత్రులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం కూడా నిషిద్దమని ఆయన తెలిపారు.
కేంద్ర వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఆస్తా గ్రోవర్ తదితర సీనియర్ అధికారులు తమ శాఖల పరిధిలోని పథకాలకు సంబందించిన అంశాలను బి.జె.పికి అందజేశారని ఆయన తెలిపారు. బి.జె.పి ఎన్నికల ప్రణాలిక, విజన్ డాక్యుమెంట్ కోసం ఆమె తమ శాఖకు సంబంధించిన స్టార్ట్ అప్ ఇండియా పథకం వివరాలు పంపించారని సింఘ్వి తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన అధికారుల బృందం లోకసభ ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే అలాంటిదేదీ లేదంటూ అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తన పరువు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపాడుకునేందుకు ఇప్పటికైనా తాము ప్రస్తావించిన అంశాలపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బి.జె.పి ప్రభుత్వ యంత్రాంగాన్ని లోకసభ ఎన్నికల కోసం దుర్వినియోగం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సింఘ్వి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ శాఖలు బి.జె.పి కోసం పని చేయటం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షాలు ఈ.వి.ఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు ఈ.వి.ఎంల విశ్వసనీయతను ప్రశ్నించటం లేదు, ఈ.వి.ఎంల విశ్వసనీయతను మరింత పెంచేందుకు 25 శాతం లేదా 33 శాతం వి.వి.ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్నదే తమ ప్రస్తుత డిమాండ్ అని ఆయన వివరించారు. ప్రతిపక్షం ఇప్పుడు కూడా ఈ.వి.ఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తోందనటం పూర్తిగా తప్పు, ప్రజలకు మరింత విశ్వాసం కల్పించేందుకు వి.వి.ప్యాట్ స్లిప్లను సరిపోల్చాలని డిమాండ్ చేస్తున్నామని సింఘ్వి చెప్పారు. కాంగ్రెస్ 1984 సిక్కుల ఊచకోత, 202 గుజరాతి అల్లర్లను ఎంత మాత్రం సమర్థించటం లేదని ఆయన స్పష్టం చేశారు.