"డిల్లీలో కూర్చొని ఫోజులు కొట్టే అరోరాకి, ఓటేసి హైదరాబాద్ ఎళ్లిన జగన్ కి, హైదరాబాద్ లో కూర్చొని .. నా మీద ఫిర్యాదులిచ్చే మాజీ బ్యూరోకాట్లు, వీళ్లకేమి తెలుసండి ..ఓటెయ్యటానికి తెల్లారిందాకా లైన్లలో నుంచొని ఆంధ్రులు పడ్డ ఇబ్బంది" ఇది ఈ రోజు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్. బుధవారం సాయంత్రం అమరావతిలో ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫారం -7 దొంగల ఐపీ అడ్రస్లు ఎందుకు ఇవ్వరు? ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నారు? ఎన్నికల్లో అవకతవకలు జరగడం ఎవరి తప్పు? గెలిచేస్తున్నాం, వచ్చేస్తున్నాం అంటూ వైసీపీ నేతలు అనవసరంగా ఆయాసపడిపోతున్నారని, ఎక్కడికి మీరు వచ్చేది? ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారని చంద్రబాబు స్పష్టం చేజశారు.
జగన్ పోలింగ్ అవగానే హైదరాబాద్ వెళ్లిపోయి విహారయాత్ర చేసుకుంటాడు, మీరెందుకు ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తారు? అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర పాలనను జగన్ కేంద్రం చేతిలో పెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాడంటూ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి, కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్పీని బదిలీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం సొంత బాబాయిని చంపి అరాచకం చేశారని సీఎం ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించి ఆలస్యం అయిందని, మళ్లీ ఈవీఎంలు పనిచేయడం మొదలుపెట్టగానే వైసీపీ హింసకు తెరలేపిందని మండిపడ్డారు. అంత బీభత్సం చేసి మళ్లీ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తూ నటిస్తారా? అంటూ నిలదీశారు.
రాష్ట్ర పరిపాలనను కేంద్రం చేతిలో పెట్టాలని జగన్ ఉబలాటపడుతున్నారని దుయ్యబట్టారు. పోలింగ్ పూర్తిగానే జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారని, విహార యాత్రలకు వెళ్లారని విమర్శించారు. ఇక్కడ ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టాలని జగన్ యత్నించారని సీఎం నిప్పులు చెరిగారు. పోలవరంపై సమీక్ష చేయకూడదని ప్రతిపక్షం మాట్లాడ్డం విడ్డురంగా ఉందని, ఎన్నికల సమయంలో మాత్రమే సమీక్ష చేయలేదని.. ఈసీ పాత్ర ఎన్నికల నిర్వహణ వరకు మాత్రమే ఉంటుందని, పాలనలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాష్ట్రంలో లేకుండా విమర్శలు చేస్తున్న వైసీపీని ఉద్దేశించి సమీక్ష చేయకూడదని నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వకూడదని వైసీపీ నేతలు ఎలా కోరతారని.. మోడీ మీరు చెప్పినట్లే ఎలా నడుచుకుంటారని ప్రశ్నించారు.