పసుపు-కుంకుమ నిధులను ఉపయోగించుకుని 20ఏళ్ల నుంచి ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం చాపరాయి వలస గిరిజన గూడేనికి చెందిన 13 మంది మహిళలు. పొలాల్లో కూలీ పనులు చేసుకునే వీరు రెండేళ్ల కిందట పొదుపు సంఘంగా ఏర్పడ్డారు. తాగునీటికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న బోరు నుంచి నీటిని మోసుకు రావాల్సిన దుస్థితికి చరమగీతం పాడాలనుకున్నారు. అధికారులకు ఈ సమస్యపై చెప్పినా పట్టించుకోకపోవడంతో వారే ముందుకు వచ్చారు. రక్షిత మంచినీటి పథకానికి రూ.లక్ష అవసరమని గుర్తించారు. ఇంట్లో భర్తల్ని ఒప్పించి రూ.34వేల విరాళాలు సేకరించారు.
అదే సమయంలో పసుపు-కుంకుమ కింద ఒక్కో సభ్యురాలికి 10వేలు అందడంతో ఒక్కొక్కరూ రూ.6వేల చొప్పున అందించాలని తీర్మానించుకున్నారు. రూ.78వేల వరకూ పోగు చేసి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. బోరుకు మోటారు, పైపు లైన్ వేసి, గ్రామంలో 2వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. నీటి సమస్య తీరడంతో వీరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో ఊరిలో నెలకు ఓ రోజు మాత్రమే నీరు వచ్చేదని తెలిపారు. తాగునీటి కోసం తాము కిలోమీటర్ దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో అయితే నీటికి తీవ్రమైన కటకట ఉండేదన్నారు. అయితే తాజాగా ట్యాంకు ఏర్పాటుతో ఊరిలోనే మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా, చాపరాయవలస మహిళలు తీసుకున్న చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.