పోలింగ్ ముగిసింది. ఎన్నికల వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరు పై సందేహాలు లేవనెత్తుతూ దేశ రాజధానిలో హల్ చల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఏకం చేసే పనిలో పడ్డారు. చంద్రబాబు ప్రయత్నాలని అడ్డుకోవటానికి జగన్ రంగంలోకి దిగారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక సంఘటనల పై రివెర్స్ లో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపై విమర్శలు చేశారు. ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టికీ తీసుకెళ్లారు. అదే సందర్భంలో లోకేష్ పైనా విమర్శలు చేసారు. మంగళగిరి పోలింగ్ బూత్ లో లోకేష్ కి ఏమి పని అంటూ జగన్ ప్రశ్నించారు.
అయితే జగన్ అర్ధం లేని వ్యాఖ్యల పై, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ ను తల లేని కోడితో పోల్చారు. కోడికి తలకాయ లేకపోయినప్పటికీ.. కొన్ని నెలల పాటు బతికేస్తుందని కొద్దిరోజుల కిందట తాను పేపర్ లో చదివానని, వైఎస్ జగన్ కూడా అలాంటి వాడేనని విమర్శించారు. తల లేని కోడిలాగే జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా అయిదేళ్ల పాటు నెట్టుకొచ్చాడని అన్నారు. జగన్ తో పోలిస్తే.. తల లేని కోడి సంగతి పెద్ద విచిత్రం కాదని అన్నారు. నేను పోటీ చెస్ నియోజకవర్గంలో, పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకునే బాధ్యత తనకు లేదా ? జగన్ చేస్తున్న వాదన వింతగా ఉంది అంటూ చురకలు అంటించారు.
ఇది లోకేష్ చేసిన ట్వీట్... "పోలింగ్ రోజున నేను పోలింగ్ బూత్ కి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు. పోలింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన ఖర్మ అనుకోవాలి. మొన్నెప్పుడో పేపర్లో చదివా ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి!"