వివేకా హత్య కేసు దర్యాప్తు దాదాపుగా చివరి దశకు చేరింది. సాక్ష్యాలు తారుమారు చేసిన వాళ్లను మొదట అరెస్ట్ చేశారు. ఇక.. హత్యఎవరు చేశారన్న విషయంలోనూ పోలీసులకు ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. సరిగ్గా ఈ సమయంలోనే జిల్లా ఎస్పీపై వేటు వేయించారు. ఈ నేపథ్యంలో అరెస్ట్‌లను ఆపేందుకు, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ఇలా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తూనే.. అటు ఈసీ నుంచి కూడా నివేదిక బయటకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి కడప జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ 40 రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు. అయినా.. వైసీపీ ఫిర్యాదు చేయగానే.. ఈసీ ఆయనను బదిలీ చేసింది. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 60 మందిని పోలీసులు విచారించారు. తమకు అనుమానం ఉన్న అన్నికోణాల్లోనూ వివరాలు సేకరించారు. కానీ.. ఇప్పుడు నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం చేసే యత్నాలు తెరవెనుక సాగుతున్నాయని చెబుతున్నారు.
ఓవైపు.. వివేకానందరెడ్డి కూతురిని ఉసిగొల్పి ఆమె ద్వారా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారన్న ప్రచారం సాగుతోంది. అలాగే.. జగన్ సోదరి షర్మిలతోనూ మీడియా ముందు విమర్శలు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు సెంటిమెంట్‌తో ఎటాక్ చేసే ప్రయత్నం శరవేగంగా సాగిస్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. అంతేకాదు.. ఎవరు ఈ అంశాన్ని లేవనెత్తినా వాళ్లమీద విమర్శలకు వెనకాడ్డం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీ కేంద్రంగా తనదైన ప్రయత్నాలు చేశారు. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆగమేఘాల మీద కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను బదిలీ చేయించారు. అయితే.. ప్రధానంగా మూడు ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ కేసు మిస్టరీ వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వివేకానందరెడ్డి ఆ స్థాయిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. పదునైన ఆయుధంతో గాయపరిచిన ఆనవాళ్లుంటే గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పోలీసులు హత్య అని ప్రకటించగానే.. మాట మార్చి ప్రభుత్వమే హత్య చేయించిందని ఎందుకు ఎటాక్ చేశారు? ఇప్పుడేమో దర్యాప్తు నివేదిక బయట పెట్టొద్దని ఎందుకు అడ్డుపడుతున్నారు. అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకుల నుంచి, తటస్థుల నుంచి వినిపిస్తున్నాయి. నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయన్న భయం వాళ్లలో కలుగుతోందన్న వ్యాఖ్యానాలూ వస్తున్నాయి. అయితే మొత్తానికి మూడు ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరకబోతుందన్నది మిస్టరీగా మారింది. ఎన్నికలలోపే దర్యాప్తు నివేదిక బయటకు వచ్చే అవకాశం ఉందా ? లేదంటే జగన్ అండ్‌కో పెనుగులాడో, మానసికంగా దాడి చేసో ఈ నివేదిక రాకుండా అడ్డుపడతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మూడు ప్రశ్నలకు బదులిచ్చేవాళ్లెవరు? నివేదిక బయటకు రాకుండా అడ్డుకునే జగన్ ప్రయత్నం సఫలమవుతుందా? ఎన్నికల ముందే పోలీసులు మిస్టరీని తేల్చేస్తారా ? అసలు నిందితులు ఎవరై ఉండొచ్చు?. త్వరలోనే ఈ సందేహాలన్నింటికీ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది.