అరాచకాలు సృష్టించే కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చారని, అవే అరాచకాలు ఇక్కడ జగన్ ద్వారా ప్రయోగిద్దామనుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలో ఎంతమందిని బదిలీ చేస్తారో చేసుకోనివ్వండని తేల్చి చెప్పారు. పోరాటమే ఊపిరిగా వచ్చిన పార్టీ తెలుగుదేశమని గుర్తుచేశారు. గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెదేపా నాయకులకు పిరికితనం ఉండటానికి వీల్లేదని, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగానే పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ధర్మాన్ని ఇప్పుడు కాపాడుకుంటే భావితరాలకు అది ఉపయోగపడుతుందని, ఆ స్ఫూర్తితో పోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
అన్యాయాలను ధైర్యంగా ఎదిరిద్దామని, తెరాస దర్శకత్వంలో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇవి పెచ్చు మీరి అధికారులనూ బదిలీ చేయించే స్థాయికి వచ్చారని మండిపడ్డారు. అరాచకమే ప్రధాన అజెండాగా ఎన్నికలకు పోతున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఏకపక్షంగా తమపై ఉపయోగించాలనుకుంటే అందుకు తగ్గ రీతిలోనే గట్టిగానే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి తమపై దాడి చేద్దామని మోదీ చూస్తుంటే గట్టిగా బదులిద్దామని అన్నారు. భాజపా పెడ బుద్ధికి ఆర్బీఐ గవర్నర్లు సైతం రాజీనామా చేసి వెళ్లిపోయారని చంద్రబాబు ఆరోపించారు. వ్యవస్థలను పతనం చేస్తే తెలుగుదేశం పార్టీ సహించబోదని తేల్చిచెప్పారు.
నిందితులు ఫిర్యాదులు చేస్తే ఈసీ ఆగమేఘాలపై చర్యలు తీసుకోవడమేంటని నిలదీశారు. వీవీ ప్యాట్ రశీదులను మరిన్ని లెక్కించాలని 22 పార్టీలు అడిగితే ఈసీ అందుకు ఒప్పుకోలేదని గుర్తు చేశారు. తెదేపా ప్రచారసభలకు ప్రజల్లో అద్భుత స్పందన ఉందన్న సీఎం.. పింఛను పొందే వృద్ధుల్లో పార్టీ అంటే ఎంతో ఆదరణ ఉందన్నారు. రేపు తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని అంతా విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని, అన్నిచోట్లా 38వ ఆవిర్భావ దినోత్సవం వినూత్నంగా జరపాలని నేతలకు సీఎం దిశానిర్దేశంచేశారు. కారణజన్ముడు ఎన్టీఆర్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.