బీజేపీ నేతల తీరుతో ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం, తనకు ఎంతో ఇష్టమైన గాంధీనగర్ సీటు నుంచి ఆ పార్టీ చీఫ్ అమిత్ షా బరిలోకి దిగుతుండడం, ఈ విషయం తనకు మాట మాత్రమైనా చెప్పకపోవడంతో అద్వానీ తీవ్ర మనస్తాపం చెందినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవకపోవడం అద్వానీని బాధించలేదని, కానీ బీజేపీ నేతలు ఆయనను అవమానించేలా వ్యవహరించారని సీనియర్ నేత సన్నిహితులు చెబుతున్నారు. గాంధీనగర్ టికెట్‌ను తనకు కేటాయించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ఆయనకు చెప్పకుండా అవమానించారని పేర్కొంటున్నారు. అంతేకాదు.. జాబితా ప్రకటన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎవరూ ఆయనను సంప్రదించకపోవడం అద్వానీని మరింత బాధించిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
1989-92 ప్రాంతాల్లో సోమ్‌నాథ్- అయోధ్య రథయాత్రను చేపట్టి ఆడ్వాణీ బీజేపీని ఓ బలవత్తర రాజకీయ పార్టీగా మార్చడంలో సఫలమయ్యారు. హిందూత్వానికి ప్రతీక అయ్యారు. 1991లో విఫలమైనా 1998, 1999ల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆడ్వాణీ మార్గం ఉపకరించింది. వాజ్‌పేయి ప్రధాని అయినపుడు ఆడ్వాణీ ఉప ప్రధాని పదవిని కూడా అలంకరించారు. హోంమంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో ఓ వెలుగువెలిగిన ఆడ్వాణీ 2014లో మోదీ ప్రభంజనం తరువాత మసకబారిపోయింది. పార్టీపై పట్టు పెంచుకోవడానికి అమిత్ షాను అధ్యక్షుఢిగా చేసిన మోదీ- ఆ క్రమంలో ఆడ్వాణీని, మరో ఇద్దరు సీనియర్ అసమ్మతి నేతలు - మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ వంటి వారిని ‘మార్గదర్శక్ మండల్’ పేరిట మూల కూర్చోబెట్టారు. ఈ మండలి ఎన్నడూ సమావేశమైనది లేదు. పైపెచ్చు, ఆడ్వాణీని ఓ మీటింగ్‌లో మోదీ అసలు పలకరించకుండా చూసీ చూడనట్లు వెళ్లిపోయి నట్లు వీడియోలు వెలువడ్డాయి.
ఈ విషయం పై, శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో బీజేపీని తూర్పారబట్టింది. అద్వానీ రాజకీయ ‘భీష్ముడు’ అని పేర్కొంది. ఆయనను బలవంతంగా రాజకీయాల నుంచి తప్పించారని ఆరోపించింది. ఆయనది బలవంతపు రిటైర్మెంట్ అని పేర్కొంది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ.. వాజ్‌పేయితో కలిసి పార్టీని నడిపించారని పేర్కొంది. అద్వానీ స్థానాన్ని నేడు మోదీ, అమిత్ షాలు లాగేసుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. గాంధీనగర్ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు అద్వానీ గెలుపొందారని, ఆ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేయడమంటే దానర్థం అద్వానీతో బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించడమేనని ‘సామ్నా’ పేర్కొంది.