సోమవారం ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.
దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పంటల భీమాతో రైతులకు ఉపయుక్తమైన కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు ఆ పథకం పనితీరుమీద నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. దీనికితోడు పంట కుంటల ఏర్పాటు ద్వారా వచ్చిన ఫలితాలను నెమరవేసుకుని వ్యవసాయ రంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. రైతు రుణమాఫీ ప్రకటిస్తే ఏమిటి ? లేదా ప్రత్యామ్నాయంగా ఎటువంటి కార్యక్రమాన్ని అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ? అనే అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘమైన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
జనవరి నెలాఖరులోగా మరో కొత్త, అతిపెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. బహుశా అది రుణమాఫీకి సంబంధించిన పథకమే అయ్యే అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల భొగట్టా. అదేవిధంగా జెడ్బీఎన్ఎఫ్ (జీరో బడ్జెట్ నాచరుల్ ఫామింగ్)పై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయం ఖరీదుగా మారిన నేపథ్యంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల వ్యయాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలిసింది. అందుకే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కేటాయింపులు, ఖర్చులను పరిశీలించి ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి చేయాల్సిన హామీలపై నిపుణులు, ఆయన సన్నిహితులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో గెలుపు అంశం ప్రధానమైనదైనప్పటికీ, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.