చంద్రబాబు గత 40 ఏళ్ళుగా చెప్పే మాట, ఎన్నికల సమయంలోనే రాజకీయం చేద్దాం, మిగతా సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడదాం అంటూ చెప్తూ ఉంటారు. అలాగే, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే, కేవలం నవ్యాంధ్ర అభివృద్ధి కోసమే పాటు పడుతున్నారు. పోలవరం, అమరావతి అనే టార్గెట్ తోనే ఆయన ప్రతి అడుగు నడుస్తుంది. ఏపికి అన్యాయం చేస్తున్నారని, ఏ మాత్రం సహాయం చెయ్యటం లేదని, మోడీ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. ప్రజలను చైతన్య పరుస్తూ, ఆందోళన చేస్తున్నారు. అయితే, మోడీ మాత్రం, ప్రజా ఆందోళనకు లొంగకుండా, కేవలం రాజకీయం చేస్తూ, ఏపి ప్రభుత్వాన్నే కూల్చే కుట్ర పన్నారు. ఇవన్నీ తెలుసుకున్న చంద్రబాబు, ఇక రాజకీయం మొదలు పెట్టారు.
ఎంతో ఓర్పుగా ఆయన పని ఆయన చేసుకుంటూ, కేవలం పోలవరం, అమరావతి అనే పిచ్చలో ఉన్న చంద్రబాబుని, ఇప్పుడు మోడీ-షా రాజకీయం వైపు నడిపించారు. ఎన్నికలు ఇంకా 8 నెలలు ఉండగానే, చంద్రబాబు రాజకీయం వైపు షిఫ్ట్ అయ్యారు. మోడీ-షా అంతు చూడటానికి రెడీ అయ్యారు. ఇక నుంచి నా ప్రతి అడుగు ఎలా ఉంటుందో చూడండి అంటూ, ఢిల్లీలో చెప్పి మరీ వచ్చారు. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఇక నుంచి తరచు ఢిల్లీకి వస్తుంటానని గత శనివారం హస్తిన పర్యటనలో చెప్పినట్టుగానే గురువారంనాడు మరోసారి ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలను చంద్రబాబు కలుసుకుంటారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి న్యూఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
కాగా, ఇటీవల ఢిల్లీ పర్యటనలో మాయవతి, కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ ప్రముఖులను చంద్రబాబు కలుసుకున్నారు. మాయావతి సైతం చంద్రబాబుతో మంతనాల అనంతరం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే విషయంలో మొత్తబడ్డారని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఆమె కోరారని పార్టీ వర్గాలు చెప్పాయి. దీంతో చంద్రబాబు సైతం... ఇక నుంచి తరచు ఢిల్లీకి వస్తుంటానని ఉత్సాహంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మంగళవారం చంద్రబాబుతో ఫోనులో సంభాషించారు. కాగా, చంద్రబాబు సైతం.... విస్తృత ప్రయోజనాలు సాధించాలంటే కొన్ని త్యాగాలకు కూడా సిద్ధం కావాలని ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలకు సూచించినట్టుగానే, బీజేపీని కేంద్రంలో ఓడించే ఏకైక లక్ష్య సాధనకు స్వల్పకాలిక ప్రయోజనాలు, త్యాగాలకు సిద్ధం కావాలని జాతీయ స్థాయి విపక్ష నేతలకు న్యూఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నచ్చజెప్పనున్నట్టు తెలుస్తోంది.