జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి తరువాత, ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా, అన్ని పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం కూడా లెకపొలేదు. సెల్ఫీ పిచ్చితో కొంత మంది ప్రమాదవశాత్తు చనిపోవటం చూసాం. అయితే, ఇప్పుడు ఈ టెన్షన్ రాజకీయ నాయకులకి కూడా పట్టుకుంది. విశాఖ విమానాశ్రయంలో విపక్షనేత జగన్‌పై దాడి ఘటన రాజకీయ నాయకుల్ని భయపెడుతోంది. టీడీపీ నాయకులు సైతం సెల్ఫీ అంటేనే భయపడిపోతున్నారు. ఇక పోలీసుల టెన్షన్ గురించి అయితే చెప్పనక్కర లేదు. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ దిగే నెపంతో ఓ వ్యక్తి దాడిచేసిన ఘటన కలకలం రేపింది. రాజకీయ వివాదం అటుంచితే- ఈ ఘటన నాయకుల్లోనే కాదు, పోలీసుల్లోనూ గుబులు రేపింది.
ఇక అదేరోజు సాయంత్రం ఫింటెక్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి మంత్రి లోకేశ్ వెళ్లిన సందర్భంగా పోలీసులు పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. విమానాశ్రయంలో ఆరోజు నెలకొన్న పరిస్థితిపైనే ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. టెక్నాలజీ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే. ఎక్కడికెళ్లినా, ఏం చేసిన ఫొటోలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఒక వ్యసనంలా పరిణమించింది. ఇక అభిమాన నటులు, నాయకులు కనిపిస్తే ఎగబడిపోతారు కొందరు. బౌన్సర్లు, సెక్యూరిటీ ఉన్నా పట్టించుకోరు. సెల్ఫీ దిగితే చాలన్నట్టు మీదపడతారు తప్ప వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకోరు. ఒక సెల్ఫీ అన్నా అంటూ వెళ్లిన ఓ అభిమాని జగన్‌పై ఏకంగా కత్తితో దాడిచేయడం విచిత్ర పరిణామం.
అయితే జగన్‌పై దాడి జరిగిన కాసేపటికే విశాఖలో ఫింటెక్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి లోకేశ్ వచ్చారు. ఈ తరుణంలో ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులు సెక్యూరిటీని అలర్ట్ చేశారు. మంత్రి రాక సందర్భంగా బయట కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. మంత్రికి స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. లోకేశ్ విమానం దిగి లాంజ్‌లోకి వచ్చారో లేదో కార్యకర్తలు ఎగబడ్డారు. సెల్ఫీ దిగేందుకు పోటెత్తారు. ఈ ఘటనతో పోలీసులు అవాక్కయ్యారు. అసలే కొద్దిసేపటి క్రితం జగన్‌పై అక్కడే దాడి జరిగింది. వెంటనే తేరుకున్న పోలీసులు లోకేశ్ చుట్టూ ఉన్నవాళ్లను వెనక్కి తోసేశారు. సెల్ఫీలకు అనుమతి లేదని గట్టిగానే చెప్పారు. అయితే లోకేశ్ మళ్లీ ఒక్కొక్కరిగా పిలిచి అందరితోనూ సెల్ఫీలు దిగారు. ఇలా లోకేష్ అనే కాకుండా, ప్రజలతో ఉండే రాజకీయ నాయకులు అందరూ, వారిని కాదనలేక సేల్ఫీలు తీస్తున్నా, జగన్ పై దాడి తరువాత మాత్రం, టెన్షన్ పడుతున్నారు.