ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సాయం ప్రకటించింది. రాష్ట్రానికి ఆర్ధిక సాయంగా 229 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అక్టోబర్ 11న తిత్లీ తుపాను కారణంగా విజయనగరం, శ్రీకాకుళం అతలాకుతలమయ్యాయి. దీంతో కేంద్రం సాయం ప్రకటించాలని ఏపీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఈ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఈ సాయాన్ని విడుదల చేశారు. కేంద్ర విపత్తు సహాయనిధి నుంచి రాష్ట్ర విపత్తు సహాయనిధికి ఈ నిధులు వచ్చాయి.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని, వారిచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని నిధుల విడుదలకు అవకాశమున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. తిత్లీ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను బాధితులకు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసిన విషయం తెలిసిందే.
ఆ లేఖలో ‘రూ.1200 కోట్ల తక్షణ సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఈ నెల 13న మీకు నిదేదిక అందజేశాం. తుపాను నష్టం ప్రాథమిక అంచనాలు రూ.3,435.29 కోట్లుగా పేర్కొంటూ ఈ నెల 15న కేంద్ర హోం మంత్రికి, హోం శాఖ కార్యదర్శికి నివేదికలు ఇచ్చాం. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరం. కేంద్రం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. తుపాను వల్ల దెబ్బతిన్న 2.25 లక్షల కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేసేందుకు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,200 కోట్ల తక్షణ సాయం ప్రకటించాల్సిందిగా మరోసారి కోరుతున్నాను’’ అని ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.