తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, రాజ్యసభలో పీఏసీ సభ్యుడు కూడా. రెండు నెలల క్రితం, అమిత్ షా వ్యూహాలు చిత్తు చేసి మరీ, పీఏసీ సభ్యుడు రమేష్ గెలిచారు. తరువాత కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేసి, దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఇక రాజ్యసభలో అయితే మోడీని ఫుట్ బాల్ ఆడుకున్నారు. మాకు ఎందుకు అన్యాయం చేసారు అంటూ పార్లమెంట్ లో నిలదీశారు. అయితే, పీఏసీ సభ్యుడిగా, కేంద్రంలో ఏ డిపార్టుమెంటు నుంచి అయినా సమాచారం తెచ్చుకునే హక్కు రమేష్ కు ఉంటుంది. దీంతో, ఆయన అసలు ఎందుకు ఏపిలో దాడులు చేస్తున్నారు, పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ ఐటి డిపార్టుమెంటుకు లేఖ రాసారు.
ఐటి డిపార్టుమెంటు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని, కేంద్ర పెద్దల ఆదేశాలతో, సియం రమేష్ పైనే దాడి చేసారు. ఐటీని అడ్డుపెట్టుకుని ఏపీపై కేంద్రం కక్షసాధిస్తోందని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనను వ్యతిరేకించేవారిని మోదీ టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌లో మాదిరిగా ఏపీలోనూ కుట్రలు చేస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థులను అణచివేస్తున్నారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులు చేస్తామని బీజేపీ నేతలే బహిరంగంగా చెప్పారన్నారు. ఐటీ దాడులు జరుగుతాయని జగన్, విజయసాయిరెడ్డి కూడా చెప్పారని తెలిపారు. ఐటీ దాడులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్నానని తెలుసుకుని ఐటీ సోదాలు చేయడం సరికాదని సీఎం రమేష్ అన్నారు.
ఏపీలో ఐటీ దాడులపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు. మోదీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోదీ కక్ష గట్టారని విమర్శించారు. కడప ఉక్కు...ఆంధ్రుల హక్కు అని అన్నందుకే ఎంపీ సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. సీఎం రమేష్ దీక్ష చేసి నేటికి వంద రోజులైనా కేంద్రంలో చలనం లేదని మంత్రి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చెయ్యాలని.. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని..హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్ స్పష్టం చేశారు.