2014కు ముందు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 55-60 మధ్య ఉండేది. అప్పట్లో ప్రధాని అభ్యర్ధి హోదాలో నరేంద్ర మోడీ గారి ఆస్కార్ పెర్ఫార్మన్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 40కి తీసుకువస్తా అని చెప్పటం, బీజేపీ వాళ్ళు చేసిన హడావిడి అంతా గుర్తు ఉండే ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆయన ప్రధాని అయ్యి, నాలుగేళ్ళు పరిపాలించారు. దేశ చరిత్రలో, 72 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీగా పతనమైంది.టర్కీ సంక్షోభం దెబ్బకు.. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70కి పడిపోయింది.
టర్కి సంక్షోభం ప్రభావంతో అత్యధికంగా పతనమైన కరెన్సీల్లో భారత్ కరెన్సీ కూడా ఉంది. పెరుగుతున్న కరెంటు ఖాతా లోటు, భారమవుతున్న ముడిచమురు దిగుమతి ధరలు కూడా రూపాయి విలువ పతనంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే రూపాయి విలువ దిగజారకుండా అడ్డుకునేందుకు ఆర్‌బిఐ తగు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. సోమవారం రూపాయి మారకం విలువ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు మరింతగా పడిపోయి రూ.70.08 పైసల వద్ద జీవన కాల కనిష్ఠానికి చేరింది.
నిన్న రూపాయి మారకపు విలువ రూ.69.93 పైసల వద్ద ముగిసింది. నేటి పతనంతో 2018లో రూపాయి విలువ పది శాతం తగ్గిపోయినట్లయింది. యూఎస్ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్ బాగా పెరగడంతో రూపాయి బలహీనపడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. నేడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 37777.96 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11402.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీని ప్రభావం సామాన్య ప్రజల పై, చాలా దారుణంగా ఉంటుంది. అయినా, ఇవేమీ మన ప్రధాని గారికి పట్టవు. ఎవరన్నా గట్టిగా అడిగితే, దేశ శ్రేయస్సు కోసం, ఇలాంటి ఇబ్బందులు పడాలి, మీరు భారతీయులు కాదా అంటూ, ఎదురుదాడి చేస్తారు. మోడీజీ చెప్పిన, అచ్చే దిన్ ఇదే అనమాట...