దాదాపు 12 వేల ఎకరాల భూసేకరణ.... 7200 నిర్వాసిత కుటుంబాల తరలింపు... 20 గ్రామాలు ఖాళీ చేయించాల్సి రావటం రూ. వందల కోట్ల వ్యయం... బాధితుల ఆందోళన...న్యాయపరమైన చిక్కులు... వీటన్నింటి మధ్యలో అక్రమార్కుల అవినీతి... వాటిపై విచారణ... భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా వందల మంది పోలీసులతో పహారా... ఈ మహా క్రతువంతా 'హిరమండల జలాశయంలో 19 టీఎంసీల నీటి నిల్వ కోసమే. ఆ జలాలే జిల్లాకు ఊపిరి అన్నంతగా ప్రభుత్వం తపించింది. నిధులు వెచ్చించి ఆటంకాలు అధిగమించి పనులు చేయించింది. ఆగస్టు 15 నాటికి వంశధార నది నుంచి నీటిని జలాశయంలోకి పంపిస్తామని పాలకులు, ప్రజాప్రతి నిధులు వేదికల పై శపథం చేశారు. వారి సంకల్పానికి ప్రకృతి సహకరించింది. వర్షం రూపంలో దీవించింది. తొలిసారిగా వరద కాలువలోకి నీరు ప్రవహించింది.
శ్రీకాకుళంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నాళ్ల గానో ఎదురుచూస్తున్న వంశధార వరద నీరు.. హిరమండలం జలా శయానికి చేరుతోంది. మంగళవారం ఉదయం కాట్రగడ్డ వద్ద వంశ ధార ప్రవాహం పెరిగి వరద కాలువలోకి నీరు చేరింది. ఆ మరపురాని క్షణాలు కళ్లముందు నిలిచాయి. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో ఆ ఆనందాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచుకున్నారు. ఎంపీ రామ్మోహ నీనాయుడు, జడ్పీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, కలెక్టర్ ధనంజయరెడ్డి, జేసీ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, వంశధార ఎస్ఈ సురేంద్రరెడ్డి తదితరుల సమక్షంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంత్రి అచ్చెన్న కేకు కోసి వేడుక నిర్వహించారు. జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. వంశ ధార జలాల ప్రవాహంతో ఆగస్టు 15 సంబరాలు ఒక రోజు ముందే వచ్చేశాయన్న ఆనందం అందరిలోనూ వ్యక్తం అయింది.
గత నాలుగు రోజులుగా వంశధారలో నీటిమట్టం ఎప్పుడు పెరుగుతుందా? అని ఎదురుచూసిన ఇంజినీరింగ్ అధికారులకు మంగళవారం 11.3 లెవెల్కు నీటిమట్టం పెరగడంతో వారి లక్ష్యం నెరవేరింది. దీంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. బుధవారం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే సమయంలో ట్రయల్ రన్ ద్వారా నీటి ని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే, అనుకున్న రోజుకంటే ఒక రోజు ముందుగానే తాత్కాలిక ట్రయ ల్ రన్ నిర్వహించారు. కాలువల స్థితిగతులను పరిశీలించి దీన్ని 4 వేల క్యూసెక్కులకు పెంచనున్నటు ఈఈ రామకృష్ణ తెలిపారు. 800 మీటర్ల మేర సైడ్ వీర్ ఉన్నప్పటికీ 50 మీటర్ల మేర మాత్రమే నీటిని విడుదల చేసినట్టు చెప్పారు. ఏడు గేట్లు ఉన్నప్పటికీ ఒక్క గేటునే మీటరు ఎత్తు పైకెత్తి వరద నీటిని మళ్లిసున్నామన్నారు.