ఈ రాష్ట్ర ప్రజలను వంచించిన అవినీతిపరుడైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో కలసి నల్ల చొక్కాలు ధరించి వంచనపై సభను నిర్వహించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఏపిఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య హేళన చేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ అవినీతిపరుడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే పెద్ద వంచకులని .. వంచనపై గర్జన పేరుతో సభలు నిర్వహించే అర్హత మీకుందా? అంటూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడు జరిగిన అవినీతిపై తాను రూపొందించిన 77 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని విడుదల చేశారు. వాటికి ముందు సమాధానాలు చెప్పి తర్వాత గర్జన పేరుతో సభలు నిర్వహించాలని జగన్‌ను హెచ్చరించారు. తాను చేసిన 77 ఆరోపణల్లో కనీసం 10 ప్రశ్నలకైనా జగన్ డా సమాధానం చెప్పగలరా అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అని దుయ్యబట్టారు. జగన్ నైతిక విలువలు లేకుండా సిగ్గు విడిచి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. మోదీ, అమిత్ షాలు నిన్ను జైలు కెళ్ళకుండా ఆపలేరని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వంచనపై గర్జన సభలో పాల్గొన్న వారంతా అవినీతిపరులేననీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అవలక్షణాలున్నాయని, వాళ్ళందరూ నల్ల చొక్కాలు వేసుకుని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అసహ్యం వ్యక్తం చేశారు. అవినీతికి మూలసామ్రాట్ అయిన బొత్స సత్యనారాయణకు అవినీతిపైన మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. నాస్తికుడిగా ఉంటూ శ్రీవారి భూములను కాజేసిన భూమున కరుణాకర రెడ్డికి ఉందా? అంటూ పేరు పేరునా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పనులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. ఇప్పటికే ఇ.డి కేసులో ఆయన భార్య భారతిని నిందితురాలిగా కొత్తగా చేర్చారన్నారు.
అదే విధంగా సి.బి.ఐ డైరెక్టర్, అక్కడి న్యాయమూర్తి సుమోటోగా భారతిని సి.బి.ఐ కేసులో కూడా నిందితురాలిగా చేర్చాలన్నారు. మత బోధకుడిగా ఉన్న బ్రదర్ అనిల్‌కుమార్ వైఎస్ అల్లుడిగా రూపాంతరం చెందాక ఏకంగా 11 కంపెనీలలో డైరెక్టర్ ఎలా కాగలిగాడో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కళంకిత చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి అవినీతి బురద అంటుకుందో వారందరిపైనా కేసులు పెట్టి నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించాలని.. అలాంటి విలువలు లేని మనిషి జగసహసే రెడ్డి అని విమర్శించారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజా వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి తన కొడుకు జగన్ అవసరాలు తీర్చే అక్షయపాత్రగా మార్చారని.. ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. తాను సంధించిన 77 ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఇతరులను తప్పుబట్టే అర్హత జగన్‌కు వస్తుందని పేర్కొంటూ ముందు మీ కంట్లో దూలాన్ని తొలగించుకుని.. తరువాత ఎదుటివారి కంట్లో నలుసు గురించి ఆలోచించవచ్చని జగన్‌కు వర్ల రామయ్య సూచించారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఎంప్లాయీస్ యూనియన్ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.