అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టారు అంటూ, ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు, రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చి, వారంలోగా సమాధానం చెప్పండి అంటూ, నోటీస్ పంపించిన విషయం తెలిసిందే. ఏపి సర్కార్ ఇచ్చిన మెమోకు, ఏబీ వెంకటేశ్వరరావు ధీటుగా సమాధానం ఇచ్చారు. రూల్ ని రూల్ తోనే కొడుతూ, ఆయన ఇచ్చిన సమాధానంతో ప్రభుత్వం అవాక్కయ్యింది. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కు ఏబీ వెంకటేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. పెగాసిస్ పై తన పేరు లాగి అనవసర రాద్దాంతం చేస్తున్నారు అంటూ ఆయన గత నెలలో ప్రెస్ మీట్ పెట్టి, పెగాసిస్ అనేది ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ప్రెస్ మీట్ లో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగానే, కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల పైన పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. అలాగే తన సస్పెన్షన్ పైన కూడా, ఆయన మీడియా సమావేశంలో అనేక ఆధారాలు రిలీజ్ చేసారు. అయితే ఈ ప్రెస్ మీట్ పైన ప్రభుత్వం షోకాజ్ నోటీస్ పంపించింది. దీని పైన వివరణ ఇస్తూ, వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలు చేస్తే స్పందించకూడదా అంటూ, ఆయన ఎదురు ప్రశ్నిస్తూ, ఒక విధంగా దమ్ముగా సమాధానం చెప్పారు.
ఆలిండియా సర్వీస్ రూల్స్ రూల్-17కి అనుగుణంగానే తాను ఆ రోజు తన పైన వచ్చిన వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు సమాధానం చెప్పానని లేఖలో తెలిపారు. తాను మీడియా సమావేశంలో ఎక్కడా కూడా ఎవరినీ విమర్శించ లేదని, పెగాసిస్ కొనలేదు అని మాత్రమే చెప్పానని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్- 6 ప్రకారం అధికారిక అంశాల మీద స్పష్టత ఇవ్వొచ్చు అని ఉందని, ఆ రూల్ ప్రకారమే తాను నడుచుకున్నా అని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అని మాత్రమే ఉందని, తాను ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని విమర్శించ లేదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తన గౌరవాన్ని కించపరుస్తూ, తన కుటుంబాన్ని లాగితే, స్పందించకుండా ఎలా ఉంటాను అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రాధమిక హక్కుతోనే, తన పైన వచ్చిన వ్యక్తిగత ఆరోపణల పై వివరణ ఇచ్చానని లేఖలో తెలిపారు. అలాగే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి తన పైన వేసిన ట్వీట్ ను కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా లేఖలో తెలిపారు. రూల్ తో కొట్టటంతో, ఇప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.