రాష్ట్రంలో చేనేత కుటుంబాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వారికి ఆర్థిక భరోసా దిశగా చర్యలు ప్రకటించారు. నూలు కొనేందుకు ఇప్పుడున్న రాయితీకి మరో పది శాతాన్ని జోడించడం వంటి చర్యల ద్వారా చేనేత రంగానికి మరింత చేయూత ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని, జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ఈ వరాల జల్లుకు వేదికై నిలిచింది. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో చేనేతలకు వంద యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.
వర్షాకాలంలో పని చేయలేని కుటుంబాలకు రెండు నెలల పాటు నెలకు రూ.4 వేల చొప్పున రూ.8 వేల పరిహారం ఇస్తామన్నారు. ఇలా రాష్ట్రంలోని 96 వేల మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. దీని కోసం ఏటా రూ.37 కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అడిగారని, పరిశీలిస్తున్నామని చెప్పారు. జీఎస్టీలో చేనేతపై అధికంగా పన్ను విధించి కేంద్రం చేనేత కార్మికుల పొట్టకొడుతోందన్నారు.
సియం ప్రకటించిన మరిన్ని వరాలు... "ఆదరణ పథకంలో రాయితీపై ఆధునిక పరికరాలిస్తాం. నూలు కొనేందుకు ఇప్పుడున్న 20 శాతం రాయితీని, 30 శాతానికి పెంచుతాం. ఆప్కోలోని 305 సొసైటీల్లో రూ.75 కోట్ల మేరకు వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తాం. ఏటా రూ.30 కోట్లతో ప్రత్యేక రిబేటు కల్పిస్తాం. చేనేతలకు ఇళ్లు, షెడ్ల నిర్మాణానికి ఇప్పుడున్న రూ.లక్షన్నర రాయితీని రూ.2.50 లక్షలకు పెంచుతాం. అమరావతిలో ప్రత్యేకంగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి, చేనేత శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తాం".