రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న కుంభకోణం... బోఫోర్స్ కంటే చాలా పెద్దదని కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి ఆరోపించారు. అటల్ బిహారీ వాజపేయీ హయాంలో మంత్రులుగా పనిచేసిన ఈ ఇద్దరూ, నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఈ కుంభకోణం గురించి వివరాలు వెల్లడించారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం ఓ భారీ కుంభకోణమని, ఏకంగా దేశ భద్రతతోనే కేంద్రం రాజీపడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే చేస్తున్న ఆరోపణలను మరికాస్త ముందుకు తీసికెళుతూ- వారు ప్రధాని మోదీనే నేరుగా టార్గెట్ చేశారు.
ప్రధానే స్వయంగా ఒప్పందపు రూపురేఖల్ని మార్చేశారని, కాంట్రాక్టు ఖరారులో రూల్స్‌ను కాలరాశారని ఆరోపించారు. రాఫెల్‌తో పోలిస్తే బోఫోర్స్ కుంభకోణం అసలు లెక్కలోకే రాదన్నారు. ఒప్పందంలో నిబంధనల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తుంగలో తొక్కారనీ ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంలో రూ.35,000 కోట్ల ప్రజాధనాన్ని కోల్పోయామని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. రూ.8000 కోట్ల నష్టాల్లో ఉంటూ విమానాల తయారీలో అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. కాగా, ఈ ఒప్పందంలో 126 యుద్ధ విమానాల సంఖ్యను ఏకంగా 36కు తగ్గించివేశారని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు కూడా తెలుపకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
‘ఇది నేరపూరిత దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఉద్దేశపూర్వకంగా చేసిన పని. అసలే క్షీణిస్తున్న రక్షణ బడ్జెట్‌పై ఒత్తిడి పెంచే చర్య. దేశ భద్రతను దెబ్బతీసే చర్య’’ అని వారిరువురూ మోదీ సర్కార్‌ను తీవ్రంగా అభిశంసించారు. ‘‘నేను గతంలో బోఫోర్స్ కుంభకోణాన్ని వెలికితీశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. రాఫెల్ ఒప్పందం బోఫోర్స్ కంటే పెద్దది. ’’ అని అరుణ్ శౌరి పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజపేయీ హయాంలో ఈ ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. రహస్యం గా ఉంచేందుకు ప్రభుత్వం యత్నిస్తున్న విషయాలను బయ టికి తీసుకురావాల్సిన పని పాత్రికేయులదేనని అన్నారు.
యశ్వంత్ సిన్హా లేవనెత్తిన ప్రశ్నలివీ.. అసలు ఒప్పందాన్ని రద్దు చేసి 36 యుద్ధవిమానాలు కొంటే చాలని వైమానికదళం ప్రభుత్వాన్ని కోరిందా? అంచనాలను వైమానిక దళం పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ 36 విమానాలకు ఒప్పుకుందా? కొత్త ఒప్పందానికి టెండర్లను ఎందుకు పిలవలేదు? 2007 నాటి ఆర్‌ఎ్‌ఫపీ, ఏడేళ్ల పాటు సాగిన చర్చలు.. అన్నీ రద్దు చేసేశారా? ప్రధాని ప్రకటనతో హెచ్‌ఏఎల్‌ను బయటికి తోసేసినట్లయింది. అది మేక్ ఇన్ ఇండియాకు విరుద్ధం కాదా? యుద్ధ విమానాల తయారీలో విశేషానుభవం ఉన్న దసాల్ట్ లాంటి సంస్థ అనుభవం లేని రిలయెన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను తన పార్ట్‌నర్ చేసుకుంటుందా? ఈ ఒప్పంద వివరాలను బహిర్గత పర్చరాదన్న వాదనలోనూ పసలేదు. వీటి సామర్థ్యానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినా ధర వివరాల్ని బయటపెట్టవచ్చు. ఎందుకలా చేయలేదు?