కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న రెండు టీవీ ఛానళ్లు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయి. సీపీఐ పార్టీ టీవీ-99 పేరుతో ఒక ఛానల్ ను ప్రారంభించగా సీపీఎం 10 టీవీ పేరుతో మరో ఛానల్ ను తీసుకుని వచ్చింది. టీవీ-99 ఆదినుండి కష్టాలను ఎదుర్కొంది. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఆరంభం నుండే టీవీ-99 కు ఎక్కడా పెద్దగా ఆదరణ కనిపించలేదు. వ్యవస్థీకృత లోపాలు ఆ ఛానల్ ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీనితో ఛానల్ నిర్వహణ బాధ్యతల నుండి సీపీఐ తప్పుకుంది. ఇప్పుడదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
జనసేన పార్టీకి చెందిన వారు ఇప్పుడు టీవీ-99 నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. నగరంలో పేరుగాంచిన బిల్డర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రస్తుతం టీవీ-99 ను కొనుగోలు చేశారు. చిరంజీవి కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా పేరుగాంచిన ఆయన ప్రజారాజ్యం తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆటు తర్వాత ఆయన వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీచేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉంటున్న తోట చంద్రశేఖర్ టీవీ-99 ను కొనుగోలును పూర్తిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఆ ఛానల్ వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఆ ఛానల్ చూస్తే విషయం అర్ధమవుతుంది.
10 టీవీ పేరుతో ప్రజల నుండి సేకరించిన విరాళాలు, వాటల ద్వారా ప్రారంభమైన ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో మంచిపేరే సంపాదించుకుంది. రెండు రాష్ట్రల్లోనూ దాదాపు అన్ని నెట్ వర్క్ లలో ఈ ఛానల్ ప్రసారం అవుతోంది. దీనితో పాటుగా ఛానల్ రేటింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. వార్తలు ప్రసారాల్లో కమ్యూనిష్టు పార్టీ ముద్ర కనపించినప్పటికీ పోటీ ఛానళ్లకు ధీటుగా 10టీవీ ఎదిగింది. చానెల్ ప్రారంభ సమయంలో ఉన్న ఉద్యోగులు లేరు. ఆ తర్వాత చానెల్ నిర్వహణ ఆర్ధికంగా కష్టంగా మారింది. దీంతో పార్టీ నాయకత్వం అతి కష్టమ్మీద చానెల్ నిర్వహిస్తోంది. ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు సర్ధుతున్నారు.
దీంతో ఈ ఛానల్ ను పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేసారు. అన్ని లావాదేవీలు, రాతకోతలు పూర్తయి ఈరోజు ఉదయం నుంచి 10 టీవీ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముంబాయికి చెందిన కొంతమందిని ముందుంచి తెరవెనుక తతంగాన్ని నిమ్మగడ్డ నడిపిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో చిరంజీవి కీలక పాత్రను పోషించినట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం జగన్ వెనకాల ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితులు మారతాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో మా టీవీని నిర్వహించిన అనుభవం పుష్కలంగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ తాను తెరవెనుక ఉండి 10టీవీ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి, జగన్, పవన్, ఇద్దరికీ సన్నిహితుడైన, నిమ్మగడ్డ చేతిలో కొత్త ఛానల్ వచ్చింది. ఇక, ఇద్దరికీ సమ న్యాయం చేసుకుంటూ, ముందుకు పోతారనమాట...