అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు కియా మరో గుడ్ న్యూస్ వినిపించింది. కియా ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సైతం రాష్ట్రం వేదిక కానుంది. దేశంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రతినిధుల బృందం చివరకు ఆంధ్రప్రదేశ్‌లోనే యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. భారత్‌లో మార్కెట్‌తోపాటు విదేశాలకు ఎగుమతులకూ వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కర్మాగార పనులు అనంతపురం జిల్లా వెనుకొండ మండలం ఎర్రమంచిలిలో ప్రారంభించిన విషయం తెలిసిందే.
535 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ కర్మాగారంలో కొత్త సంవత్సర కానుకగా మొదటి కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కియా యత్నిస్తోంది. పనుల పురోగతిని కియా ప్రతినిధుల బృందం ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రికి వివరించగా.. జనవరి ఒకటికల్లా తొలి కారును మార్కెట్లోకి తేవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కర్మాగార పనులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్‌నూ నెలకొల్పేందుకు కియా ఆసక్తి చూపుతోంది. ఇదే అంశాన్ని సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి ముందుంచగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కియా మోటార్స్ కోసం ఎర్రమంచిలిలో ఇదివరకే దాదాపు 672 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వందెకరాల్లో కొండ కూడా ఉంది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు మరో 570 ఎకరాలకు పైగా భూములు అవసరమని కియా మోటార్స్ తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. 73.50 ఎకరాల్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్, 433 ఎకరాల్లో అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ఇంకో 84 ఎకరాలు డంపింగ్ యార్డు కోసం అవసరమని సూచించింది. దీంతో అదనపు భూ సమీకరణ కోసం అధికారులు దృష్టిపెట్టారు. భూ కేటాయింపు పూర్తయ్యాక కియా ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించే యోచనతో ప్రభుత్వం ఉంది. దీంతో అధికారులు ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.