తక్షణ పరిస్థితుల్లో పూర్తిచేయలేని గాలేరు-నగరి ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రత్యా మ్నాయంగా రాయలసీమ ప్రాంతంలో మరో పట్టిసీమ తరహా ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రాగునీటి, సాగునీటి అవసరాలను చర్చించడం తో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చే లక్ష్యంతో రూ. 1000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వచ్చే డిసెం బర్‌లోగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి- కృష్ణా నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా లభించిన విశేష ఫలితాల స్ఫూర్తి తోనే ఈ తాత్కాలిక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చెప్పుకోదగిన విశేషం. నిత్య కరువు సీమగా పేరొందిన రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాలకు తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు వరప్రసాదాలనే విషయం అందరికి తెలిసిందే. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట రిజర్వాయర్ వరకు గాలేరు-నగరి ప్రాజెక్టు తర్వాత దశలో కారణాంతరాలవల్ల నత్తనడక నడుస్తోంది.
ముఖ్యంగా కడపజిల్లా కోడూరు నుంచి చిత్తూరుజిల్లా రేణిగుంట, శ్రీకాళహస్థి, పుత్తూరు, నగిరి మీదుగా సాగాల్సిన కాల్వ పనులకు అటవి పరమైన అనుమతులు అడ్డుకట్టగా పరిణమిస్తున్నాయి. మరోవైపు చిత్తూరుజిల్లా రేణిగుంట, శ్రీకాళహస్థి ప్రాంతాలలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక హబ్‌కు నీటి లభ్యతను చూపించాల్సిన ఆవస్యకత ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించడానికి నెల్లూరు జిల్లా వైపునుంచి చిత్తూరుజిల్లా శ్రీకాళహస్థి వరకు నిర్మించతలపెట్టిన సోమశిల స్వర్ణముఖి కాల్వ పనులకు కూడా అటవిశాఖ అనుమతులు ఆటంకాలు అవుతున్నాయి. ఈ దశలో గోదావరి కృష్ణానదుల అనుసంధానంతో నిర్మించతలపెట్టిన పోలవరం భారీ ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా 15 వందల కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల సాధించిన ఫలితాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. పట్టిసీమ ప్రాజెక్టు స్తూర్తితో ఇప్పట్లో పూర్తిచేయలేని గాలేరునగిరి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక అవసరాలు తీర్చే ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించాలని నిపుణులకు నిర్దేశించారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి మూడు లిఫ్ ్టఇరిగేషన్ పథకాలు, మూడు రిజర్వాయర్ల ద్వారా సాగు నీటిని అందించే తాత్కాలిక ప్రాజెక్టులకు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు రూపకల్పన చేశారు. తాజా ప్రణాళిక ప్రకారం వెంకటగిరి మార్గంలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో అత్తూరుపాడు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించి దాన్ని చైన్నైకి తెలుగుగంగ నీటిని తీసుకువెళ్ళే కండలేరు, పూండి కాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా నింపుతారు. ఆ రిజర్వాయర్ నుంచి ఇప్పటికే నిర్మితమై ఉన్న స్వర్ణముఖి సోమశిల కాల్వ ద్వారా దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు వద్ద ఉన్న మేర్లపాక వరకు వాలు (గ్రావిటేషన్) ద్వారా నీటిని తీసుకువస్తారు. అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్‌ను ఎత్తిపోతల ద్వారా నీటితో నింపుతారు. ఆ రిజర్వాయర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మిత మౌతున్న బాలాజి రిజర్వాయర్‌ను మరో ఎత్తిపోతల ద్వారా నీటితో నింపుతారు. అధికారిక అంచనాల ప్రకారం మూడు ఎత్తిపోతల, మూడు రిజర్వాయర్‌లతో నిర్మించ తలపెట్టిన ఈ తాత్కాలిక రిజర్వాయర్‌కు రూ. 1000 కోట్ల వ్యయం అవుతుందని తెలుస్తోంది.
ఈ మొత్తం ప్రక్రియ ద్వారా తిరుపతి త్రాగునీటి అవసరాలతోపాటు ఎగువ ఉన్న సాగు నీటి అవసరాలకు, అలాగే ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక హబ్ అవసరాలను వెంటనే తీర్చేందుకు వీలుంటుందని జలవనరుల శాఖ తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్‌రెడ్డి చెబుతున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు రూపొందిన ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతివారం ఈ ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరోక్షంగా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా అమరావతిలో జరిగిన సమీక్షలో వచ్చే మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. కాని వచ్చే డిసెంబర్‌లోగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని అధికారులు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద పలు రకాల అడ్డంకుల కారణంగా ఇప్పట్లో పూర్తి చేయడానికి వీలు కాని పరిస్థితి చేరుకున్న గాలేరునగిరి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా రానున్న ఐదారేళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ||1000 కోట్ల వ్యయంతో నిర్మించే తాత్కాలిక నీటి పారుదల ప్రాజెక్టు ఈ ఏడాది చివరకు సమగ్రరూపాన్ని సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.