మా అంత నీతిమంతులు, ఈ ప్రపంచలోనే లేరు, అసలు చరిత్రలో మా అంత విలువలు ఉన్న వారు లేరు అంటూ, రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తూ ఉంటారు. మన రాష్ట్రంలో జగన్ టార్చర్ భరించలేక, తెలుగుదేశం పార్టీలో చేరిన వారి గురించి, ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే, వారి ఆరాధ్య రాష్ట్రం, వారికి ఏంటో ఇష్టమైన గుజరాత్ లో జరిగిన సంఘటనకు, మరి ఏమి సమాధానం చెప్తారో. ఇది దేశ ప్రయోజనాల కోసం జరిగింది, ప్రజలే సర్దుకుపోవాలి అంటారేమో.. విషయానికి వస్తే, గుజరాత్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత కున్‌వార్‌జీ బవలియా కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరారు. కాగా ఆయనకు గుజరాత్‌లోని భాజపా ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలోనే క్యాబినెట్ మంత్రి పదవి కట్టబెట్టింది. అంతేకాకుండా ఆయనకు మూడు పోర్ట్‌ఫోలియోలు అప్పగించింది. నీటి సరఫరా, పశు సంరక్షణ, గ్రామీణ గృహ నిర్మాణం శాఖలను కున్‌వార్‌జీకి అప్పగించినట్లు చీఫ్ సెక్రటరీ జేఎన్ సింగ్ వెల్లడించారు. గాంధీనగర్‌లో ఈరోజు క్యాబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తనకు అప్పగించిన శాఖలన్నింటిపైనా తనకు ఆసక్తి ఉందని, అన్ని గ్రామీణ ప్రజలకు సంబంధించనవే అని, ఈ శాఖలకు తాను న్యాయం చేయగలననే నమ్మకం తనకు ఉందని బవలియా విలేకరులకు వెల్లడించారు. బవలియా రాజ్‌కోట్‌లోని జస్దాన్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేరుగా భాజపా కార్యాలయానికి వచ్చి భాజపాలో చేరారు. వెంటనే ఆయనను భాజపా ఆయనను క్యాబినెట్ మంత్రిగా నియమించి రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించింది. పరిణామాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుల రాజకీయాలు చేస్తున్నారని బవలియా ఆరోపించారు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన బవలియా కోలి వర్గానికి చెందిన వారు. ఆయన భాజపాలో చేరడంతో పార్టీకి ఆ ప్రాంతంలో ప్రభావం బాగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ కోలి వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలో భాజపాకు ఆశించిన ఫలితాలు రాలేదు. గత ఎన్నికల్లో పటీదార్ కులానికి చెందిన వారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడంతో భాజపాపై తీవ్ర ప్రభావం పడింది. సౌరాష్ట్రలోని 20 అసెంబ్లీ స్థానాల్లో కోలి వర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారు.