ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఏలేరు రైతులకు ఇచ్చిన మాట నెరవేరింది. దాదాపు నాలుగైదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల కృషి ఫలించింది. ఏలేరు, విశాఖ నగరం పారిశ్రామిక అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు రూ.1,698 కోట్లతో నిర్మించిన సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా 10 మోటార్లు, 10 పంపులు సిద్దం అయ్యాయి. ఖరీఫ్ సాగు సమయంలో ఏలేరు జలాశయానికి, విశాఖ పారిశ్రామిక అవసరాలకు మొత్తం 23. 44 టీఎంసీల నీటిని సరఫరా చెయ్యనున్నారు.
ఈ పథకానికి గత ఏడాది జనవరి 5న పిఠాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శంకుస్థాపన చేయగా అదే ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించినట్లు వివరించారు. మొదటి దశలో రెండు పంపుల ద్వారా ఏలేరుకు 15 టీఎంసీల నీటిని అందించారు. పూర్తి స్థాయిలో పనులు చేపట్టేందుకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం పనులన్నీ పూర్తయ్యాయి. ఖరీఫ్లో ఏలేరు అయకట్టు పరిధిలోని 67,614 ఎకరాల పంట భూములను స్థిరీకరించేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు చేరుతుంది. గోదావరి కనిష్ట నీటి మట్టం 14 మీటర్లకు చేరితే 10 మోటార్ల ద్వారా 3,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసుకోవచ్చు.
జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లోని 63వేల ఎకరాల్లో రైతులు ఏలేరు నీటిని ఆధారంగా చేసుకుని సాగు చేస్తుంటారు. మరోపక్క ఏలేశ్వరం, ప్రత్తిపాడు, జగ్గం పేట, గండేపల్లి మండలాల్లోని గ్రామాలకు రక్షిత మంచినీటిని సైతం ఏలేరు నుంచి సరఫరా చేస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టులోకి వర్షాకాలంలో మాత్రమే నీరు వచ్చి చేరుతుంది. గతంలో వర్షాలు అధికంగా పడడంతో ఏలేరు ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా దర్శనమిచ్చేది. రానురాను వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు కేవలం రెండు టీఎంసీల దిగువస్థాయికి నీటి సామర్ధ్యం చేరుకుంటోంది. దీంతో ఇటు సాగుకు అటు తాగడానికి నీరు లేకుండాపోతోంది. మరోపక్క ప్రాజెక్ట్ లో ఉన్న ఆతిస్వల్ప నీటిని కొంతమేర వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కచ్చితంగా సరఫరా చేసేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ సాగు చేసుకునే రైతులు తాగడానికి మంచినీరు లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాలను గుర్తించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో గోదావరి నీటిని ఏలేరుకు అనుసంధానం చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్మించి మెట్టసీమకు నీరందించడానికి సిద్ధమయ్యారు. దీంతో ఏలేరు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టులోకి సరిపోగా అదనంగా మిగిలి వచ్చే నీటిని కృష్ణవరం వద్ద ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ నుంచి ఏలేరు కాలువకు తరలించి శివారు ఆయకట్టు వరకు నీరందించడానికి ప్రణాళికలు తయారుచేశారు. ఇదే నీటిని విశాఖకు తరలించి అక్కడ ఏర్పాటు చేసిన సుజలస్రవంతి పథకం ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్న జిల్లాలకు పూర్తిస్థాయిలో రక్షితనీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.