విశాఖపట్నం జిల్లా, రాజేంద్రపాలెం మండలంలోని గ్రామానికి చెందిన టైలర్ మావూరి నాగేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడు శివకృష్ణ మనోహర్ జీఈఈ అడ్వాన్సుడ్ లో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. తమ కుమారుడుకి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు వస్తుందని ఊహించలేదు అని మనోహర్ తల్లిదండ్రులు అన్నారు. టైలర్ గా పని చేసే నా కుమారుడు, ఇంత గొప్ప ఘనత సాధించటం సంతోషంగా ఉందని తండ్రి అన్నారు. మనోహర్ ఐదో తరగతి వరకు రాజేంద్రపాలెం ప్రభుత్వ స్కూల్ లో చదివాడు. నవోదయ ప్రవేశ పరీక్ష రాసి, మంచి ర్యాంకు రావడంతో కొమ్మాదిలోని నవోదయ స్కూల్ లో చేరాడు. టెన్త్ పూర్తీ అయ్యాక, ఇంటర్ లో చేరటానికి fitjee నిర్వహించిన పరీక్ష రాసాడు. ఉత్తమ ప్రతిభ చూపటంతో కళాశాల యాజమాన్యం విజయవాడలో ఉచితంగా సీటు ఇచ్చి, హాస్టల్ సదుపాయం కూడా కలిపించింది..
శివ కృష్ణ మనోహర్ గురువారం సాయంత్రం ఉండవల్లిలో ప్రజావేదిక హాలులో ముఖ్యమంత్రిని కలిశారు. శివ కృష్ణ మనోహర్ విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఐఐటీలో ఆలిండియా 5వ ర్యాంకు సాధించడం గొప్ప విశేషమని ముఖ్యమంత్రి అన్నారు. తండ్రి నాగేశ్వరరావు టైలరింగ్ వృత్తి చేసుకుంటూ తన కుమారుడిని ఉన్నత చదువులకు ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని ముఖ్యమంత్రి చెప్పారు.
గత నాలుగు సంవత్సరాలలో విద్యాశాఖలో తీసుకున్న అనేక నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించగలరని అన్నారు. శివ కృష్ణ మనోహర్ విజయవాడ FIITJEE ఇనిస్టిట్యూట్ లో ఇంటర్ చదువుకున్నాడని డైరెక్టర్ పి.రమేష్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రిన్సిపాల్ రామకృష్ణ ఉన్నారు.