సమాజంలో బ్రతికే ప్రతివాడికి భయం, భాధ్యత ఉండాలి.. ఇది ఆంధ్రప్రదేశ్.. నీచులకు ఈ గడ్డపై తావు లేదు. ఎవ్వరైనా పద్ధతిగా ఉండాల్సిందే. ఆంబోతుల్లా రోడ్లమీదికి వస్తామంటే కుదరదు. అలాంటి వారిని దేవుడు కూడా రక్షించలేడు. భూమిమీద అదే వారికి ఆఖరి రోజు అవుతుంది... తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలూ ఖబడ్దార్.. ఇది, గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటన పై, ముఖ్యమంత్రి స్పందన... ఇటీవల జరిగిన కథువా, ఉన్నావో వంటి వరుస ఘటనలు దేశాన్నే కలచి వేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. "అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ తయారవుతున్నారు. అందుకే నేను చెబుతున్నాను. ఇదొక హెచ్చరిక కావాలి. ఎవ్వరినీ వదిలి పెట్టము. ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేరం చేసినా ఏమీ జరగబోదనే ధీమా ఎవ్వరిలోనూ ఉండడానికి వీల్లేదు.
నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు పెడతామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు తెస్తామని అన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన అత్యంత నీచమైన నేరమని, తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను శనివారం పరామర్శిస్తానన్నారు. ఆ బాలికకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు, చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నేరస్తులకు ఒక హెచ్చరిక జారీ చేసేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక తహసీల్దారు, పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించే ర్యాలీలో తాను పాల్గొంటానన్నారు. రెండు మూడు గంటలపాటు జరిగే ఈ ర్యాలీల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. దాచేపల్లి ఘటన నేపథ్యంలోనూ వైకాపా తప్పుడు రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘‘ఖబడ్దార్. తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలనూ వదిలిపెట్టను. తమాషాలు చేయొద్దు. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను’’ అని హెచ్చరించారు.