మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య ర్యాలీలు నిర్వహించనుంది. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలు ఇకపై రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. వీటిని నిర్వహించే బాధ్యతను అన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఈ విషయం తెలుసుకున్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి చంద్రబాబుకి ఫోన్ చేసారు. చంద్రబాబును నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కొనియాడారు.
'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' కార్యక్రమం చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్టు సత్యార్థి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని, తాను కూడా హాజరవుతానని సీఎంకు సత్యార్థి తెలిపారు.. కైలాష్ సత్యార్థి ఫోన్ చేసినందుకు, చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుని, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమి చెయ్యాలి, సమాజం బాధ్యత, తల్లి దండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతల పై, ప్రసంగించాలని, సలహాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.
విజయవాడలో సోమవారం నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ర్యాలీని ప్రారంభించి, రెండు కిలోమీటర్లు ప్రదర్శనలో భాగంగా ముఖ్యమంత్రి నడుస్తూ ఇందిరాగాంధీ క్రీడా మైదానం వద్దకు వస్తారు. అదే సమయంలో నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల నుంచి ర్యాలీలుగా బయలుదేరి స్టేడియం వద్దకు చేరుకుంటాయి. ‘ఆడబిడ్డల రక్షణకు కదులుదాం’ అంటూ సభలో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారు. సభ, ర్యాలీ ఏర్పాట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం రాత్రి పరిశీలించారు.