రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ సీఎం చంద్రబా బు చేసిన దీక్షలో గుంటూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య కూడా ఆసాంతం పాల్గొన్నారు. రాష్ట్రం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 96 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో పట్టుదలతో ఉదయం గం.5.30కే గుంటూరు నుంచి విజయవాడకు వచ్చారు. దీక్ష ప్రారంభ సమయం కంటే పావు గంట ముందే చేరుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి ఆయన పక్కనే ఆశీనులై సాయంత్రం 7 గంటల వరకు మంచినీళ్లు కూడా ముట్టకుండా, కూర్చున్న చోట నుంచి కదలకుండా దీక్ష నిర్వహించి తాను వయసు రీత్యా వృద్ధుడినేకాని మానసికంగానూ, ఆరోగ్యపరంగానూ యువకుడినేని చాటుకున్నారు.
చంద్రబాబు దీక్ష ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగం ప్రారంభంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శివరామకృష్ణయ్య పట్టుదలను ప్రశంసించారు. గుజరాత్లోని మహాత్మాగాంధీ సేవాగ్రాంలో హిందీ కోర్సు చదివిన శివరామకృష్ణయ్య ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వంటివారు శివరామకృష్ణయ్య శిష్యులే. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడలో జన్మించిన పావులూరి, ఆచార్య ఎన్జీ రంగా సహచరుడిగా గాంధీకి దగ్గరయ్యారు. కావూరులోని వినయాశ్రమంలో కొద్ది కాలం మహాత్మాగాంఽధీతో కలసిపనిచేసే అవకాశం లభించింది.
దీంతో ఆయన మహాత్మాగాంధీ శిష్యుడిగా మారిపోయారు. ఆ తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో గౌతు లచ్చన్న, బెజవాడ గోపాలరెడ్డి వంటి వారితో పాల్గొని ఆలీపూర్ జైలులో ఉన్నారు. ఎంతో సాధారణ జీవితం గడిపే శివరామకృష్ణయ్య ఈ వయస్సులో కూడా ప్రయాణం చేయాల్సివస్తే కొడుకులో, మనవళ్లో పంపే కార్ల కోసం ఎదురు చూడరు. ఓపిగ్గా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రధాని మోదీకి సద్బుద్ధి కలగచేయాలని, సీఎం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పార్టీలకు అతీతంగా అందరు కలిసి మద్దతు ఇవ్వాలని శివరామకృష్ణయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు పుట్టినరోజు అయినా సరే మోదీ మనస్సును గాంధేయ సిద్దాంతాలతో కరిగించాలని దీక్ష చేపట్టడం విశేషమన్నారు.