రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి నాలుగేళ్లు ప్రయాణించినా.. ఎలాంటి ఫలితం దక్కలేదని.. అందుకే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు కేంద్ర నిఘా విభాగం అధిపతి(ఐబీ) రాజీవ్‌జైన్‌కు సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. బుధవారం అమరావతి వచ్చిన రాజీవ్ జైన్ సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ముందు అరగంట అనుకొన్న సమావేశం సుమారుగా గంటసేపు జరిగినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఐబీ చీఫ్ ఇక్కడకు వచ్చారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నా.. ఈ భేటీలో వర్తమాన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకహోదా.. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం, కేంద్ర మంత్రివర్గం, ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులను సీఎం వివరించారు.
‘నాలుగేళ్లు ఎంతో సహనంతో ఎదురుచూశాం. అయినా ఫలితం దక్కలేదు. అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పూర్తిగా ఎత్తివేస్తున్నామని చెబితే ప్రత్యేక ఆర్థికసాయానికి ఒప్పుకొన్నాం. దానికింద కూడా ఇంతవరకూ ఎలాంటి సాయం చేయలేదు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు హోదా ప్రయోజనాలు మళ్లీ కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఆ జాబితాలో ఏపీని కూడా చేరిస్తే సరిపోతుందని కోరాం. దానికీ ఒప్పుకోలేదు. మేం బీజేపీతో కలిసిందే రాష్ట్ర అవసరాల కోసం. అవి నెరవేరనప్పుడు కలిసి ఉండి ఏం ప్రయోజనం?. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాం’ అని సీఎం వివరించారు. ఈ భేటీకి ముందు ఐబీ డైరెక్టర్ రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించి దాని పనితీరును అడిగి తెలుసుకొన్నారు.
ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత రాజీవ్ జైన్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మాలకొండయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్‌శాఖ పనితీరును జైన్ అడిగి తెలుసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో బాగా ముందున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాలకొండయ్య ఆయనకు వివరించారు. అమరావతిలో గ్రేహౌండ్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ వంటి వసతుల అభివృద్ధికి నిధుల కొరత ఉందని డీజీపీ చెప్పారు. 14వ ఆర్థికసంఘం ప్రతిపాదనల్లో పోలీస్ శాఖకు నిధుల లభ్యత పెద్దగా లేదని, 15వ ఆర్థికసంఘం సిఫారసుల్లో ఆ లోపం కొంతమేర సవరించే అవకాశం ఉందని ఐబీ చీఫ్ ఆయనతో చెప్పినట్లు సమాచారం.