సోదర, సోదరీమణులారా, అందరికీ నమస్కారం... ఈ రోజు నేను ధర్మ పోరాట దీక్ష చేపట్టాను. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఆహారం ముట్టకుండా నిరశన వ్రతాన్ని చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తున్నాను. మన రాష్ట్రానికి కేంద్రం వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన సమయం ఇది. 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014'లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తన ఆఖరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయమే చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. నూతనంగా ఏర్పడిన మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఆస్తుల అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్లు, తిరిగి చెల్లింపుల్లో మిక్కిలి నష్టం జరిగింది.
విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం చెయ్యాలి; రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి; ఉక్కు కర్మాగారం స్థాపించాలి; ఓడ రేవు రావాలి; పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు కావాలి; నియోజకవర్గాల సంఖ్య పెరగాలి; అనేక విద్యా, పరిశోధన సంస్థలు ప్రారంభించాలి; ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాలి. విభజన బిల్లు రాజ్య సభలో ఆమోదింప చేయడానికి ఆనాటి ప్రధాన మంత్రి ఆరు హామీలతో కూడిన ప్రకటన చేసారు. అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్నందున ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీ చేయడం, బుందేల్ఖండ్, కోరాపుట్-బోలాంగిర్-కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించడం.
కానీ ఇప్పుడు రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు. ఓడ రేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు. విద్యా సంస్థల పురోగతి మందంగా ఉంది. ఇప్పుడు ఇస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే ఇరవై యేళ్ళకైనా పూర్తవుతాయా అన్న సందేహం కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన నత్తనడక నడుస్తోంది. విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజీకి ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్లు చూపిస్తున్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి కుట్ర పూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది.
పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. మన ప్రజల చిరకాల స్వప్నం. ఏడు ముంపు మండలాలను మనకు బదలాయించిన తర్వాత కేంద్రం నుంచి అందాల్సిన సాయం మందగించింది. ఖర్చు చేసిన సుమారు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉంది. దీని వడ్డీ భారం మనం మోయాల్సి వస్తోంది. పదునాల్గవ ఆర్ధిక సంఘం సిఫార్సుల దరిమిలా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇప్పుడు హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమనీ కేంద్రం చెప్పింది. హోదా బదులు దానికి సరిసమానమైన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక సహాయాన్ని ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమీ రాక పోగా, ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వడం, పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. పదునాల్గవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదనీ, అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షులు, సభ్యులు బహిరంగంగా చెప్పారు.
ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్థిక సంఘం చెప్పనప్పుడు, రాయితీలు ప్రోత్సాహకాలు ప్రస్తుత హోదా రాష్ట్రాలకు కొనసాగిస్తున్నపుడు మన రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇచ్చి తీరాల్సిందేనని డిమాండు చేస్తున్నాను. చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు అసంపూర్తిగా, ఆలస్యంగా జరగడం మన రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు తార్కాణం. రాష్ట్రానికి చట్టపరంగా దక్కాల్సిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం లోని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు హేళనగా మాట్లాడుతున్నారు. ఇది సహించరానిది.
కేంద్రానికి రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది. మరీ ముఖ్యం గా రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, అన్యాయంగా విభజన జరిగి కష్టాలలో ఉన్న మన రాష్ట్రం పట్ల ఆ బాధ్యత మరింత ఎక్కువ. మనం నిలదొక్కుకుని మన కాళ్ళమీద మనం నిలబడేంత వరకూ కేంద్రం చేయూత అందించాలి. చట్టం లో లేనివీ, పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలలో లేనివి మనం అడగడం లేదు. మనవి చట్టబద్ధమైన డిమాండ్లని న్యాయమైన కోరికలని కేంద్రం గుర్తించి వ్యవహరించాలి. వీటన్నింటినీ సంపూర్ణంగా నెరవేర్చే వరకూ మన పోరాటం కొనసాగించాలి. ఇది శాంతియుతంగా, చట్టబద్ధంగా సాగాలి.
ఈ పోరాటంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, రాష్ట్రానికి చెందినవారు ప్రపంచంలో ఎక్కడ వున్నా భాగస్వాములు కావాలని, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి తమ వంతు కృషి చేయాలని కోరుతున్నాను. ఐదుకోట్ల రాష్ట్ర ప్రజల తరుపున నేను చేసే ఈ పోరాటానికి మీరంతా బాసటగా నిలవాలని, నాతో కలిసి నడవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు నారా చంద్రబాబు నాయుడు.