కేంద్ర సహాయ నిరాకరణతో అమరావతి నిర్మాణంపై ప్రజానీకంలో అనేక సందేహాలు తలెత్తాయని, వాటిని పటాపంచలు చేసేలా రాజధాని నిర్మాణంలో వేగం పుంజుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం తన మాటను నిలబెట్టుకోకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని, ప్రజలే ముందుకొచ్చి సొంతంగా నిధులను సమకూర్చడానికి సన్నద్ధం కావడం అన్నింటి కంటే విశేషమని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని సడలనీయకుండా నిర్ణిత వ్యవధిలోగా పనులను పూర్తిచేయడంలో నిర్మాణ సంస్థలు సహకరించాలని కోరారు. అలా కాకుండా పనులలో ఉదాశీనత ప్రదర్శిస్తే ఇక ఏమాత్రం ఉపేక్షించబోనని స్పష్టంచేశారు.
అమరావతి అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పురపాలక మంత్రి పి. నారాయణతో బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు, వివిధ ప్రాజెక్టులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి నగర నిర్మాణానికి అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై రానున్న 18 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఐతే, దీనిని కేవలం తాత్కాలిక ప్రణాళికగానే తీసుకోవాలని, పరిస్థితులు, రాబడి మార్గాల ఆధారంగా ఎప్పటికప్పుడు ఈ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం రూ.23,294 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని, మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 48,115 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఈ నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి మొత్తం అంచనా వ్యయం రూ.51 వేల కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రూ.38,590 కోట్ల మేర హడ్కో, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకోవడానికి అవకాశం ఉందని వివరించారు. మెకన్సీ, క్రిసిల్ వంటి ప్రముఖ కన్సల్టెంట్ల సహకారంతో ఈ ప్రణాళికను రూపొందించామని అన్నారు. కీలక రాజధాని ప్రాంతంలో గల 5020 ఎకరాల భూమిని ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచి దాని ద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. మరో నాలుగేళ్లలో సీఆర్‌డీఏ సొంత ఆదాయ మార్గాలలో స్వయంగా నిధులను సమకూర్చుకునే స్థాయికి ఎదగగలదని అంచనా వేస్తున్నట్టుగా చెప్పారు.
పరిపాలన నగరం అభివృద్ధిని ప్రత్యేకంగా పరిగణించి దానికోసం విడిగా నిధుల ప్రణాళికను తయారుచేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. 1300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పరిపాలన నగరంలో మానిటైజేషన్ కోసం కేటాయించే భూమి ఎంతో పరిశీలించి ప్రణాళికను చేయాలని అన్నారు. అలాగే, జీఎస్‌టీ ద్వారా సమకూరే ఆదాయం, ఆస్తి పన్నులు, ఇతర మార్గాలలో వచ్చే ఆదాయాలను గమనంలోకి తీసుకుని రాజధానికి అవసరమయ్యే ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఏ నగరమైనా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందుతుందని ఎవరూ అనుకోరని, హోటళ్లు, స్కూళ్లు, కళాశాలలు, వ్యాపార కూడళ్లు.. ఇలా ఒక్కొక్క నిర్మాణం జరిగి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం ద్వారా పరిణామ క్రమంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్నంతా తీసుకెళ్లి హైదరాబాదులో పెట్టి ఆ నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగా కొందరు ప్రచారం చేశారని, ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఆనాడు తాము హైదరాబాద్ అభివృద్ధికి మళ్లించలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘సైబరాబాద్, శంషాబాద్ నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతికాం. తరువాతి క్రమంలో అక్కడ పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు జరగడంతో సెల్ఫ్ సస్టెయినబులిటీ వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘కేంద్రం సహకరించడం లేదని, పనులు నిలిచిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. అవేవీ నిజం కాదు. రాజధాని నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించాల్సి వుందని అన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను డ్రోన్ల ద్వారా చిత్రీకరించి రెండు నిమిషాల నిడివి గల లఘుచిత్రాలను ప్రతి నెలా సినిమా ధియేటర్లలో, మీడియా ఛానళ్లలో ప్రదర్శించాలని సూచించారు.
మొత్తం పరిపాలన నగరంలో 54 వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉపయోగించే ప్రాంతంగా ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో రహదారుల వరకు ప్రాధాన్యంగా తీసుకుని ముందు భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని, న్యాయపరమైన అవరోధాలు ఉంటే న్యాయస్థానాలలో కేవియట్లు వేసుకుని సంబంధిత స్థలం సత్వరం స్వాధీనం చేసుకునేలా చూడాలని సూచించారు. ఈ వ్యాజ్యాల వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయనే విషయాన్ని న్యాయస్థానాలకు చెప్పాలని అన్నారు. రాజధానిలో జరుగుతున్న రహదారి పనుల పురోగతిని ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాల కోసం మొత్తం 1945 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నామని, పెనుమాక గ్రామంలోనే 540 ఎకరాల మేర భూ సేకరణ జరపాల్సివుందని అధికారులు చెప్పారు. ఉండవల్లి, తాడేపల్లి గ్రామాలలో కూడా ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఉండవల్లిలో రహదారి అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేస్తున్నామని వివరించారు. తాము 32 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా, అందులో 19.5 కిలోమీరట్ల పనిని పూర్తిచేసినట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధి చెప్పారు. నవంబరు నెలాఖరుకు తమ ప్యాకేజ్ పనులన్నీ పూర్తిచేస్తామని తెలిపారు. తమ ప్యాకేజీలో 4.2 కిలోమీటర్ల మేర భూ సేకరణ జరపాల్సి ఉందని వివరించారు. డిసెంబరు నాటికి రహదారుల పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయని నిర్మాణ సంస్థలను పక్కన పెట్టాల్సి వస్తుందని, ఇందులో మొహమాట పడబోనని అన్నారు. 58 కిలోమీటర్ల మేర ఉన్న తమ ప్యాకేజీ పనులను నవంబరు నాటికి పూర్తిచేస్తామని ఎన్‌సీపీ తెలిపింది. వంతెనలు, డిజైన్ల తయారీలో జరిగిన జాప్యం వల్ల ఈ సంస్థ చేపట్టిన పనులలో కొంత మేర ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు. 32 కిలోమీటర్లలో చేపట్టిన తమ ప్యాకేజ్ పనులలో 7 కిలోమీటర్ల మేర భూ సేకరణ సమస్య ఉందని మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి చెప్పారు. పూర్తిస్థాయిలో అక్విప్‌మెంట్ తరలించి పనులను శీఘ్రగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఈ సంస్థను ఆదేశించారు. బీఎస్‌ఆర్, ఎన్ సీసీ, బీఎస్‌సీ, ఆర్వీఆర్ తదితర సంస్థలు చేపట్టిన ప్యాకేజీ పనులను కూడా ముఖ్యమంత్రి వివరంగా తెలుసుకున్నారు. ఎక్కడా కూడా యంత్ర పరికరాలు, మానవ వనరుల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీయం సూచించారు.
రాజధానిలో గృహ అవసరాల కోసం 3 ప్యాకేజీల కింద పనులను చేపట్టామని కమిషనర్ తెలిపారు. 1258 కిలోమీటర్ల మేర 3 జోన్లుగా విభజించి ఎల్‌పీఎస్ లే అవుట్ల అభివృద్ధిని చేపట్టామని చెప్పారు. తొలుత ఎల్‌పీఎస్ అభివృద్ధిని పూర్తిచేస్తేనే రాజధానిలో ఇతరత్రా నిర్మాణ పనులు మొదలవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడం కోసం నిధులను ముందే విడుదల చేయాలని ఆయా ఆర్థిక సంస్థలను కోరాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తే ప్రజలే ముందుకొచ్చి రుణాలు అందించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ కోసం 5 ఎకరాల స్థలం కేటాయించి ప్రైవేట్ భాగస్వామ్యం, నిర్వహణతో పూర్తిచేద్దామని సమావేశంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. శాఖమూరు ఉద్యానవనాన్ని సైతం ఇదే రీతిలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టామని గుర్తుచేశారు. అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.15 వేల కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయని ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి చెప్పారు. ప్రధాన రహదారి వెంబడి, ముఖ్యమైన ప్రదేశాలలో పచ్చిక బయళ్లను అభివృద్ధి చేయడం వల్ల దుమ్ము, ధూళి నిరోధించవచ్చునని, ముఖ్యంగా విజయవాడ-గుంటూరు వరకు రహదారి వెంబడి బ్యూటిఫికేషన్ పనులను ఏడాదిలోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, 50 కిలోమీటర్ల మేర ఉన్న విజయవాడలోని కాల్వలను సుందరీకరించే ప్రాజెక్టును సత్వరం చేపట్టాలని ఏడీసీకి సూచించారు. గ్రీనరీ నిర్వహణ కోసం జల వనరుల శాఖ సమన్వయం చేసుకుని చిన్న చిన్న చెక్ డ్యాములను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. హోటళ్లు, స్కూళ్లు, హాస్పటళ్ల ఏర్పాటు వెంటపడితే మినహా పూర్తి కావని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలన నగరం అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయం నిర్మాణ ప్రక్రియ త్వరలోనే టెండర్ల దశకు వెళ్తున్నట్టు చెప్పారు. 2 ప్యాకేజీలుగా సచివాలయం నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. తొలిదశలో రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు వెళ్తున్నామని తెలిపారు. హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెలాఖరుకు టెండర్లకు వెళుతున్నామని తెలిపారు. జిల్లా కోర్టు ఏర్పాటుపై టెండర్ ఓపెన్ చేశామని వివరించారు. ఈ వారంలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 2026 కోట్ల మేర ఆంధ్రాబ్యాంక్, విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈనెల 21న యుకే హాస్పటల్ గ్రూపు ప్రతినిధులు వస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఆతిధ్య రంగానికి సంబంధించి ఐదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లు కొన్ని ముందుకు వచ్చాయని కమిషనర్ చెప్పారు. 3 ఐదు నక్షత్రాల హోటళ్లు, 3 మూడు నక్షత్రాల హోటళ్లు ఆసక్తి చూపాయని అన్నారు. 5 వేల గదుల చొప్పున నిర్మించడానికి మహీంద్ర, తాజ్ గ్రూపులు అంగీకరించాయని ముఖ్యమంత్రి తెలిపారు. మేరియట్, ఫోర్ సీజన్స్ వంటి ప్రముఖ సంస్థలను సంప్రదించాలని సూచించారు. రాజధానిలో ఏ ప్రాంతంలో హోటళ్లు రావాలో ముందే మార్క్ చేసుకోవాలని చెప్పారు. 10 వేల హోటల్ గదుల ఏర్పాటే లక్ష్యంగా ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహిద్దామని నిర్ణయించారు. సీఆర్‌డీఏ తరఫున 35 ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు. సీఆర్‌డీఏ, ఏడీసీతో కలిసి పర్యాటక శాఖ కొన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సి వుందని అన్నారు. అక్షరథామ్, టీటీడీ, బిర్లా దేవాలయాలు ఏర్పాటుకు ఆయా సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.