మొన్న హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి వచ్చి, మన రాష్ట్రం అవినీతిలో మొదటి ప్లేస్ అని, అందుకే పరిశ్రమలు రావటం లేదని అన్నాడు, ఒక మహానుభావుడు... కాని ఆయన గారికి, దేశంలోనే అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తో, కియా లాంటి పరిశ్రమ 13 వేల కోట్లతో పనులు మొదలు పెట్టిన సంగతి తెలియదు.. తెలిసినా చెప్పడు... అలాగే ఇప్పుడు, చంద్రబాబు మీద నమ్మకంతో, కియాకి అనుబంధంగా మరో 16 పరిశ్రమలు పెట్టుబడి పెట్టటానికి వచ్చాయి... సోమవారం ఏపీలో కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కియా అనుబంధ సంస్థలైన ‘హ్యుండై మొబిస్’తో ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమిక అవగాహన ఒప్పంద పత్రం మీద ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమల మంత్రి అమరనాథరెడ్డి సమక్షంలో సంతకం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తమ విధానాలతో నిబద్ధతతో కూడిన పెట్టుబడిదారులు వచ్చి రూ.24,600 కోట్లు (3.7 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టారన్నారు. అనంతపురము నుంచి నెల్లూరు వరకు చిత్తూరు మీదుగా ఆటో కారిడార్ గా తయారవుతుందన్నారు. రూ.4,790 కోట్ల పెట్టుబడులతో కొరియన్ కంపెనీలు 6.,583 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అన్నారు. అనంతపురము జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్ కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, , అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తాను గతనెలలోనే కియా మోటార్స్ ఫ్రేమ్ వర్క్ వ్యవస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇప్పుడు ప్రాజెక్టు ప్రాంగణంలో పురోగతిని చూశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఆటోమొబైల్ అనుబంధ సంస్థలతో కలసి ఏర్పాటు చేస్తున్న ఈ క్లస్టర్ భారత్‌లోనే అతి పెద్ద ఎఫ్.డి.ఐగా అభివర్ణించారు. అనంతపురం జిల్లాకు, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు బాటవేస్తున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొరియన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఇది శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆటొమొబైల్ రంగ అభివృద్ధి వాతావరణం ఏర్పడుతుందని, ఎం.ఎస్.ఎం.ఈ యూనిట్లు పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్‌కు సకారాత్మక బ్రాండ్ ఇమేజి వస్తుందని అన్నారు. తాము మూడేళ్ల క్రితం దేశంలో అత్యుత్తమమైన ఆటొమొబైల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. అనంతపురము బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉందని, త్వరలో ఓర్వకల్లులో ఒక విమానాశ్రయం రానుందని, ఇప్పటికే తిరుపతి, పుట్టపర్తిలో విమానాశ్రయాలున్నాయని తెలిపారు.
కియా మోటార్స్ సహా ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ కంపెనీలైన ఇసుజు మోటార్స్-అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని, వీటిలో సుజుకి ఇప్పటికే శ్రీసిటీలో వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కియామోటార్స్ కు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని, తాము నిబద్ధతతో ఉన్నామని, ముందుగానే అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఈ ప్రాంతం ఒక ఆటోమొబైల్ క్లస్టర్ గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని అన్నారు. తాను ఇటీవల బుసాన్‌లో పర్యటించానని చెప్పారు. అనంతపురాన్ని రెండవ స్వగృహంగా భావించాలని ముఖ్యమంత్రి కోరారు. ఓవైపు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున చేపడుతూనే మరోవైపు భారీ స్థాయిలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.